సాక్షి, అమరావతి: చంద్రబాబునాయుడు లోపాయికారీ పొత్తుల కుట్ర రాజకీయాలకు రాష్ట్ర ఓటర్లు చావుదెబ్బ కొట్టారు. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను చీల్చడం ద్వారా ప్రజల్ని వంచించాలన్న టీడీపీ ఎత్తులను చిత్తుచేశారు. లోపాయికారీ పొత్తులో ప్రధాన సూత్రధారి టీడీపీని తుడిచిపెట్టేశారు. ఈ రాజకీయ కుట్రలో చంద్రబాబు పార్టనర్ పవన్ కల్యాణ్‌కు ఘోర పరాజయాన్ని రుచి చూపించారు. లోపాయికారీ కుట్రలో మైనర్ పార్టనర్లు అయిన సీపీఎం, సీపీఐ, బీఎస్పీలను ప్రజలు నిర్ద్వందంగా తిరస్కరించారు. నిజాయితీ రాజకీయాలకే తాము పట్టం కడతామంటూ జగన్‌కు జైకొట్టారు.
లోపాయికారీ పొత్తుల కుట్ర
ప్రతి ఎన్నికకు కొత్త పొత్తులతో ప్రజలను ఏమార్చే చంద్రబాబు.. 2019 ఎన్నికల్లో కొత్త రాజకీయ కుట్రకు తెరలేపారు. టీడీపీ ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చేందుకు లోపాయికారీ పన్నాగాన్ని రచించారు. అందులో భాగంగానే 2018లో పవన్ కల్యాణ్ టీడీపీ నుంచి వేరుపడ్డారు. అడపదడపా జిల్లాల్లో పర్యటిస్తూ హడావుడి చేశారు. కేవలం జనసేనతో ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీల్చడం సాధ్యంకాదని చంద్రబాబు కొత్త పార్టీలను ఆ పొత్తుల చట్రంలోకి తీసుకువచ్చారు. సీపీఎం, సీపీఐలతోపాటు బీఎస్పీతో కూడా జనసేన పొత్తు పెట్టుకునేట్లుగా చంద్రబాబు కథ నడిపించారు. ఇక ఆ నాలుగు పార్టీల మధ్య సీట్ల సర్దుబాటును కూడా చంద్రబాబు కన్నుసన్నల్లోనే సాగింది. చంద్రబాబుకు రాజకీయ ప్రయోజనం కలిగించేలా సీపీఎం, సీపీఐలకు చెరో ఏడు నియోజకవర్గాలు జనసేన కేటాయించింది. 2014 ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ గెలిచిన సీట్లనే అత్యధికంగా వామపక్షాలకు కేటాయించారు.
ఆ నియోజకవర్గాల్లో జనసేన పోటీచేస్తే.. టీడీపీ ఓట్లే చీలి టీడీపీ మరింత బలహీనపడుతుంది. అందుకే ఆ నియోజకవర్గాల్లో టీడీపీకి లోపాయికారీగా సహకరించేందుకే జనసేన పోటీచేయలేదు. మంత్రి లోకేశ్ పోటీచేసిన మంగళగిరి నియోజకవర్గంలో జనసేన పోటీచేయకపోవడం ఇందులో భాగమే. ఆ నియోజకవర్గంలో కాస్త పట్టున్న సీపీఎంకు కాకుండా సీపీఐకు ఆ స్థానాన్ని కేటాయించడంతో ఆ పార్టీల కుట్ర బట్టబయలైంది. ఇక బీఎస్పీకి కూడా వైఎస్సార్‌సీపీ బలంగా ఉన్న నియోజకవర్గాలనే కేటాయించారు. మరోవైపు.. ఢిల్లీలో రాహుల్‌గాంధీతో జట్టుకట్టిన చంద్రబాబుకు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ లోపాయికారీగా సహకరించింది. వైఎస్సార్‌సీపీ ఓట్లను కొంతమేరైనా సరే చీల్చడమే లక్ష్యంగా పనిచేసింది.
ప్రచారంలోనూ కుట్రలే కుట్రలు
కాగా, ఎన్నికల ప్రచారంలో కూడా జనసేన, వామపక్షాలు, బీఎస్పీలతో చంద్రబాబు లోపాయికారీ కుట్రలను కొనసాగించారు. చంద్రబాబు, మంత్రి లోకేష్ పోటీచేసిన మంగళగిరి నియోజకవర్గంలో పవన్ ప్రచారం చేయలేదు. అలాగే, పవన్ స్వయంగా పోటీచేసిన గాజువాక, భీమవరం నియోజకవర్గాల్లో చంద్రబాబు కూడా టీడీపీ తరఫున ప్రచారం నిర్వహించనే లేదు. పవన్ కల్యాణ్ కూడా తన ప్రచారంలో చంద్రబాబునుగానీ టీడీపీ ప్రభుత్వాన్నిగానీ పెద్దగా విమర్శించకుండా ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌పైనే ఆరోపణలు గుప్పించారు.
జనసేనకూ దారుణ పరాభవం
ఇక 136 నియోజకవర్గాల్లో పోటీచేసిన జనసేనను కూడా ఓటర్లు నిర్ద్వందంగా తిరస్కరించారు. ఆ పార్టీ కేవలం ఒక్క స్థానంలోనే గెలుపొందింది. పార్టీ అధినేత పవన్ కల్యాణ్ తాను పోటీచేసిన రెండు నియోజకవర్గాలు భీమవరం, గాజువాకలలో ఓడిపోయి తీవ్ర అవమానాన్ని మూటగట్టుకున్నారు. ఓ పార్టీ అధినేత రెండుస్థానాల్లో పోటీచేసి రెండింటిలోనూ ఓడిపోవడం రాష్ట్ర చరిత్రలో ఇదే తొలిసారి. 2009లో తిరుపతి, పాలకొల్లు నియోజకవర్గాల్లో పోటీచేసిన ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడు చిరంజీవి.. తిరుపతిలో గెలిచి పాలకొల్లులో ఓడిపోయారు. 1989లో టీడీపీ అధ్యక్షుడు ఎన్టీ రామారావు హిందూపూర్, వనపర్తి (తెలంగాణాలోని మహబూబ్‌నగర్ జిల్లా)లలో పోటీచేయగా.. హిందూపూర్‌లో గెలిచి వనపర్తిలో ఓడిపోయారు. కానీ, ఈసారి పవన్ కల్యాణ్ రెండు నియోజకవర్గాల్లోనూ ఓడిపోవడం గమనార్హం.
వామపక్షాలకూ ఘోర ఓటమి
ఇక సీపీఎం, సీపీఐ చెరో ఏడు నియోజకవర్గాల్లో పోటీచేయగా అన్నింటిలోనూ ఘోరంగా ఓడిపోయాయి. సీపీఎం పోటీచేసిన ఏడు నియోజకవర్గాల్లో కురుపాం, అరకు, రంపచోడవరం, విజయవాడ సెంట్రల్, సంతనూతలపాడు, కర్నూలు స్థానాల్లో వైఎస్సార్‌సీపీని ప్రజలు గెలిపించారు. పొత్తుల్లో భాగంగా సీపీఎం పోటీచేసిన కర్నూలు, నెల్లూరు ఎంపీ స్థానాల్లోనూ వైఎస్సార్‌సీపీ ఘన విజయం సాధించింది. సీపీఐ పోటీచేసిన ఏడు నియోజకవర్గాల్లో ఆరు స్థానాల్లో వైఎస్సార్‌సీపీని ఓటర్లు విజయ తీరానికి నడిపించారు. ఆ పార్టీ పోటీచేసిన కడప, అనంతపురం నియోజకవర్గాల్లో వైఎస్సార్‌సీపీనే విజయదుందుభి మోగించింది. అలాగే, వైఎస్సార్‌సీపీకి బలమైన మద్దతుదారులుగా ఉన్న దళితుల ఓట్లను చీల్చడమే లక్ష్యంగా చంద్రబాబు ప్రయోగించిన బీఎస్పీ కార్డును సైతం ప్రజలు నిర్ద్వందంగా తిరస్కరించారు. ఆ పార్టీ పోటీచేసిన 32 నియోజకవర్గాలతోపాటు తిరుపతి, చిత్తూరు, బాపట్ల ఎంపీ స్థానాల్లో డిపాజిట్లు కూడా దక్కించుకోలేకపోయింది.
బాబు ఎత్తులు చిత్తుచిత్తు
చంద్రబాబు లోపాయికారీ కుట్రను ఓటర్లు చిత్తుచిత్తు చేశారు. టీడీపీకి దారుణ పరాజయాన్ని కానుకగా ఇచ్చారు. జనసేన సినిమా రైట్స్‌ను టీడీపీకి అమ్మిన పవన్ కల్యాణ్‌కు ప్రజలు గుణపాఠం చెప్పారు. ఆ పార్టీతో పొత్తుపెట్టుకున్న వామపక్షాలు, బీఎస్పీలను డిపాజిట్లు దక్కకుండా ఓడించారు. లోపాయికారీ రాజకీయ కుట్రలో ప్రధాన భాగస్వామి అయినా టీడీపీకి చావు దెబ్బకొట్టారు. టీడీపీ పోటీచేసిన 175 నియోజకవర్గాల్లో 150 స్థానాల్లో చిత్తయ్యింది. కేవలం 25 స్థానాలలోపే కట్టడి చేశారు. 1982లో టీడీపీ ఆవిర్భవించిన తరువాత ఆ పార్టీ ఇంతటి ఘోర పరాజయాన్ని చవిచూడటం ఇదే తొలిసారి. చంద్రబాబు మంత్రివర్గంలోని 24మంది మంత్రుల్లో ఏకంగా 22మంది ఓడిపోవడం ప్రజాగ్రహానికి నిదర్శనంగా నిలుస్తోంది. వారిలో చంద్రబాబు కుమారుడు లోకేశ్ కూడా ఉండటం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment