సాక్షి, నరసాపురం : మట్టి నుంచి మరుగుదొడ్ల దాకా అన్నింటా అవినీతికి పాల్పడుతున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిపై ప్రజల్లో తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం అవుతున్నాయి. ఇంటికొక ఉద్యోగం ఇస్తానని, లేనిపక్షంలో నెలకు 2 వేల రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తానన్నఅబద్ధపు వాగ్ధానాలను గుర్తుచేసుకుంటూ తెలుగుదేశం పార్టీ (టీడీపీ)పై జనం మండిపడుతున్నారు. వాణిజ్య సదస్సుల ద్వారా వేల కోట్ల పెట్టుబడులు, లక్షల్లో ఉద్యోగాలు సాధించామని సొంత డప్పుకొట్టుకుంటున్న ఏపీ సీఎం తీరును యువత ఎక్కడిక్కడే ప్రశ్నిస్తున్నారు. ‘బాబు చేతిలో మోసపోయామన్నా...’ అంటూ జననేతకు గోడు చెప్పుకుంటున్నారు.
చంద్రబాబూ.. ఇటు చూడు : 176వ రోజు ప్రజాసంకల్పయాత్రలో భాగంగా వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి.. పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురం నియోజకవర్గంలో ప్రజలతో మమేకం అయ్యారు. కొప్పర్రు శివారు(నైట్ క్యాంప్) నుంచి బుధవారం ఉదయం కొప్పర్రు నుంచి లిఖితపూడి, సరిపల్లి మీదుగా పాదయాత్ర చేశారు. ఈ క్రమంలో మురళీకృష్ణ అనే టీడీపీ కార్యకర్త జననేతను కలుసుకుని తన కష్టాన్ని చెప్పుకున్నాడు. ‘చంద్రబాబూ చూడు..’ అంటూ టీడీపీ సభ్యత్వ కార్డును చింపేసి, నేలకేసి కొట్టాడు.
ఎందుకిలా చేశాడు? : ‘‘నా పేరు మురళీకృష్ణ. మాది విజయవాడ. భీమవరంలోని మా బంధువుల జ్యూస్ షాప్‌లో కూలీగా పనిచేస్తున్నాను. టీడీపీని నమ్మి మోసపోయాను. జెండాలు కట్టడం దగ్గర్నుంచి అన్ని పనులూ చేశాను. చదువుకున్న నాకు ఏదో ఒక బతుకుదెరువు చూపిస్తామన్న టీడీపీ నాయకులు.. డబ్బులిస్తేనేగానీ ఉద్యోగం లేదని అంటున్నారు. మూడు లక్షలు ఇస్తే విజయవాడ కార్పొరేషన్‌లోనో, మంగళగిరి రిజిస్ట్రేషన్ ఆఫీసులోనో ఔట్ సోర్సింగ్ ఉద్యోగం పెట్టిస్తామని చెబుతున్నారు. నా దగ్గర అంతస్థోమత లేదు..’’ అంటూ ఆ యువకుడు చెప్పుకొచ్చాడు. ఏపీలో రాబోయే ప్రజా ప్రభుత్వంలో మురళీకృష్ణ లాంటి తమ్ముళ్లందరికీ న్యాయం దక్కుతుందని వైఎస్ జగన్ హామీ ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment