టీడీపీ గూండాల దాడిలో ధ్వంసమైన వాహనం, గాయపడిన ముస్తఫా, అంబటి (ఫైల్)
సాక్షి, గుంటూరు: ప్రశాంతంగా ఉన్న గుంటూరు జిల్లా పల్నాడు ప్రాంతంలో ఏదో జరిగిపోతోందని ‘చలో ఆత్మకూరు’ పేరుతో గత ఏడాది సెప్టెంబర్‌లో నానాయాగీ చేసిన టీడీపీ.. తాజాగా మరో అలజడి సృష్టించి శాంతిభద్రతల సమస్యలకు పన్నాగం పన్నడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తమ పార్టీ వారితో స్థానిక జిల్లా నేతలు నామినేషన్లు వేయించాల్సింది పోయి విజయవాడకు చెందిన టీడీపీ నేతలు బొండా ఉమామహేశ్వరరావు, బుద్దా వెంకన్నను చంద్రబాబు పల్నాడుకు పంపడంపై పెద్దఎత్తున అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో.. 2014–19 వరకు టీడీపీ హయాంలో ఈ ప్రాంతంలో ఆ పార్టీ నాయకులు చేసిన అరాచకాలను స్థానికులు గుర్తుచేసుకుంటున్నారు.
- 2014 జూలై 13న ముప్పాళ్ల ఎంపీపీ ఎన్నికకు ఎంపీటీసీలతో వెళ్తున్న వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే మహ్మద్ ముస్తఫా, అంబటి రాంబాబుపై మాజీ స్పీకర్ కోడెల తనయుడు శివరామ్ గూండాలతో మేడికొండూరు వద్ద దాడులు చేయించారు. ఎంపీపీలు ప్రయాణిస్తున్న బస్సు, ఎమ్మెల్యే వాహనాన్ని ధ్వంసం చేయడమే కాక ముస్తఫా, అంబటిలను తీవ్రంగా గాయపరిచి భయానక వాతావరణం సృష్టించారు.
టీడీపీ గూండాల దాడిలో ధ్వంసమైన వాహనం
5 ఏళ్ల పాలనలో టీడీపీ దుర్మార్గాలు
- 2014 సెప్టెంబర్ 11న మాచర్ల నియోజకవర్గం కారంపూడి మండలం చినగార్లపాడు గ్రామంలో వైఎస్సార్‌సీపీ నాయకుడు వేంపాటి గోవిందరెడ్డి (45)పారిపోతున్నా వదలకుండా టీడీపీ మూకలు వెంటాడి కత్తులతో నరికి చంపాయి. అడ్డు వచ్చిన అతని భార్య కోటేశ్వరమ్మను సైతం హతమార్చేందుకు ప్రయత్నించారు.
- 2014 సెప్టెంబర్ 22న వినుకొండ నియోజకవర్గం బొల్లాపల్లి మండలం మేళ్లవాగు గ్రామంలో టీడీపీ వర్గీయులు వైఎస్సార్‌సీపీ నేతలు పెద నాగిరెడ్డి, చిన నాగిరెడ్డిలను హతమార్చారు.
- 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చాక నీలగంగవరం గ్రామంలో రావులపల్లి పెదమునయ్యపై టీడీపీ వర్గీయులు దాడిచేసి గాయపరచడంతో అతను మృతిచెందాడు.
- 2014 డిసెంబర్ 19న మాచర్ల నియోజకవర్గం దుర్గి మండలం జంగమహేశ్వరపాడుకు చెందిన వైఎస్సార్‌సీపీ నేత గుడిపాటి వెంకట్రామయ్యను కూడా టీడీపీ వర్గీయులు హతమార్చారు. కోర్టు వాయిదాకు వెళ్లొస్తున్న ఆయనపై టీడీపీ వర్గీయులు గొడ్డళ్లు, కర్రలతో దాడిచేసి అతి కిరాతకంగా చంపారు.
- 2015లో కారంపూడి మండలం నరమాలపాడుకు చెందిన వైఎస్సార్‌సీపీ నేత పెద వెంకటేశ్వర్లు (బ్రహ్మం)నూ టీడీపీ వర్గీయులు నరికి చంపారు.
- 2017 డిసెంబర్‌లో మాచర్ల నియోజకవర్గం వెల్దుర్తి మండలం గంగలకుంటకు చెందిన వైఎస్సార్‌సీపీ నేత సాంబయ్యను టీడీపీ వర్గీయులు వేటకొడవళ్లతో నరికి చంపారు. - 2019 ఏప్రిల్ 11న సార్వత్రిక ఎన్నికల పోలింగ్ రోజున గురజాల పట్టణంలో టీడీపీ నాయకులు అరాచకం సృష్టించారు. వైఎస్సార్‌సీపీ సానుభూతిపరులైన ముస్లింలపై దాడులకు తెగబడ్డారు. ఆస్తులు ధ్వంసం చేశారు. అదే విధంగా గురజాల నియోజకవర్గంలోని వివిధ గ్రామాల్లో వైఎస్సార్‌సీపీ నేతలపై దాడులు, హత్యాయత్నాలకు పాల్పడ్డారు.
అధికారం కోల్పోయినా అదే తీరు
- గత ఏడాది డిసెంబర్ 27న రాజధాని ప్రాంతంలోని మందడంలో మీడియా ప్రతినిధులు, పోలీసులపై టీడీపీ మూకలు దాడిచేశాయి.
- జనవరి 7న గుంటూరు జిల్లా చినకాకాని వద్ద ప్రభుత్వ విప్, మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై టీడీపీ గూండాలు రాళ్లు, కర్రలతో దాడి చేయడంతో ఆయన తృటిలో తప్పించుకున్నారు.
- ఫిబ్రవరి 2న కృష్ణాజిల్లా నందిగామలో బాపట్ల ఎంపీ సురేష్‌పై దాడికి తెగబడ్డారు. ఇదే నెల 23న అమరావతి మండలం లేమల్లె గ్రామంలో సురేష్‌పై మరోసారి టీడీపీ శ్రేణులు కారం చల్లి దాడికి పాల్పడ్డారు.
- ఫిబ్రవరి 17న కృష్ణాజిల్లా విజయవాడ రూరల్ మండలం కొత్తూరు తాడేపల్లి గ్రామంలో గ్రామసభ నిర్వహిస్తున్న తహసీల్దార్ వనజాక్షిపై టీడీపీ ప్రోద్బలంతో కొందరు వ్యక్తులు, మహిళలు దాడికి పాల్పడ్డారు.
- ఫిబ్రవరి 20న మంగళగిరి రూరల్ మండలంలోని ఓ ప్రైవేట్ యూనివర్సిటీలో జరిగిన కార్యక్రమానికి హాజరైన వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే రోజా కారును టీడీపీ గూండాలు అడ్డుకుని ఆమెపై దాడికి విఫలయత్నం చేశారు. ఇదే రోజు తుళ్లూరు డీఎస్పీ శ్రీనివాసరెడ్డి, డ్రోన్ కెమెరా ఆపరేట్ చేస్తున్న ఓ కానిస్టేబుల్‌పైనా ఆందోళనకారుల ముసుగులో టీడీపీ నాయకులు మందడంలో దాడికి తెగబడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment