సాక్షి, చిత్తూరు : ఎమ్మెల్యే అభ్యర్థుల ఎంపికలో చంద్రబాబు వ్యవహరిస్తున్న తీరుపట్ల రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ శ్రేణులు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నాయి. కొంతమంది బహిరంగంగా తమ అసంతృప్తిని వెళ్లలగక్కి.. పార్టీని వీడుతుంటే.. మరి కొంతమంది అంతర్గతంగా తమ నిరసనను తెలుపుతున్నారు. స్థానిక నేతల అభిప్రాయాలు తీసుకోకుండా ధనబలం చూసి ఎమ్మెల్యే టికెట్లు కేటాయిస్తున్నారని పార్టీ కార్యకర్తలు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యేలుగా కొనసాగుతూ పార్టీకి సేవ చేసిన నేతలను కాదని చివరి నిమిషంలో ఇతరులకు కేటాయిస్తున్నారని మండిపడుతున్నారు. పార్టీ క్యాడర్ కాదన్న వ్యక్తులను టికెట్ ఇస్తూ సిట్టింగ్‌లను అవమానిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
టీడీపీలో రాజుకున్న అసమ్మతి సెగలు
తాజాగా శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల గోపాల కృష్ణారెడ్డిని ఘోర అవమానానికి గురిచేశారు చంద్రబాబునాయుడు. ఎమ్మెల్యే టికెట్ కోసం టీడీపీ అధినేత చంద్రబాబు చుట్టూ రెండు రోజలుగా తిరుగుతున్న పట్టించుకోలేదు. కుటుంబంతో సహా రెండు రోజులుగా అమరావతిలో పడిగావులు పడ్డ కనికరించలేదు. చంద్రబాబు తీరుపై బొజ్జల వర్గీయులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. కాగా శ్రీకాళహస్తి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎస్పీవీ నాయుడు వైపు చంద్రబాబు మొగ్గుచూపుతున్నట్లు సమాచారం. ఒక వేళ ఎస్పీవీ నాయుడుకి శ్రీకాళహస్తి టికెట్ ఇస్తే కచ్చితంగా ఓడిస్తామని స్థానిక నేతలు, కార్యకర్తలు హెచ్చరిస్తున్నారు.
మరోవైపు సత్యవేడు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎంపిలో కూడా సస్పెన్షన్ నెలకొంది. సిట్టింగ్ ఎమ్మెల్యే ఆదిత్యను పక్కనపెట్టే యోచనలో చంద్రబాబు ఉన్నారు. సత్యవేడు టికెట్ కోసం మాజీ ఎమ్మెల్యే హేమలత తీవ్రంగా ప్రయత్నిస్తోంది. కాగా ఆదిత్య, హేమలతను కాదని జేడీ రాజశేఖర్‌వైపు చంద్రబాబు మొగ్గు చూపుతున్నారు. జేడీ రాజశేఖర్‌కు టికెట్ ఇవ్వడాన్ని టీడీపీ శ్రేణులు వ్యతిరేకిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment