
టీడీపీ నేత వీరశివా రెడ్డి, మంత్రి ఆదినారాయణ రెడ్డి
వైఎస్సార్ జిల్లా: మంత్రి ఆదినారాయణ రెడ్డిపై కమలాపురం మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత వీరశివారెడ్డి మండిపడ్డారు. ఆదినారాయణ రెడ్డి కొత్తగా టీడీపీలోకి వచ్చి పెత్తనం కోసం టీడీపీలో చీలికలు తెస్తున్నారని ధ్వజమెత్తారు. టీడీపీలో సీనియర్ నేతగా ఉన్న తన గురించి నిన్న గాక మొన్న వచ్చిన మంత్రి మాట్లాడాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో రాబోయే ఎన్నికల్లో టీడీపీ టికెట్లు ఇవ్వండని ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆదినారాయణకు ఏమైనా చెప్పాడా అని సూటిగా అడిగారు. రాష్ట్ర టీడీపీ చరిత్రలో ఒకే నియోజకవర్గ పరిధిలో రెండు మినీ మహానాడులు జరగడం ఇదే మొదటిసారని చెప్పారు.
‘ తాను ఎప్పుడైనా నీ పేరును కానీ నీ ప్రస్తావన కానీ తీసుకువచ్చానా. అభివృద్ధి చేస్తే ముఖ్యమంత్రి చంద్రబాబు ఎలాగైనా టిక్కెట్లు ఇస్తారు. నేను నీ జోలికి రాను. నువ్వు నా ప్రస్తావన తీసుకుని రావద్దు. నువ్వు ఒకటి అంటే నేను రెండు అంటాను. నువ్వేమీ టీడీపీ టిక్కెట్లు ఇచ్చేవాడివి కాదు. రాష్ట్రంలో ఏ జిల్లాలోనూ టీడీపీ టిక్కెట్లపై చర్చ లేదు. కేవలం మంత్రి ఆదినారాయణ రెడ్డి మాత్రమే జిల్లాలో టిక్కెట్ల ప్రస్తావన తెస్తూ గొడవలు మొదలు పెడుతున్నారు’ అని తీవ్రంగా మండిపడ్డారు.