సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో అస్తిత్వంకోసం కొట్లాడుతున్న తెలుగుదేశం పార్టీలో ఇంకా కొనసాగుతున్న రాజకీయ నాయకుల భవిష్యత్తేంటో వారికే అర్థం కావడం లేదని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. గతంలో పార్టీలో కీలక నేతలుగా, రాష్ట్ర మంత్రులుగా పలు హోదాల్లో.. ఓ వెలుగు వెలిగిన వీరు మారిన రాజకీయ పరిస్థితుల్లో చట్రబంధంలో ఇరుక్కుపోయారనే భావన వ్యక్తమవుతోంది. రాష్ట్రంలో దాదాపు టీడీపీ ఖాళీ అయినా.. వేళ్ల మీద లెక్కపెట్టగలిగినంత మంది నేతలు ఇంకా అదే పార్టీలో కొనసాగుతున్నారు. అయితే ఇలాంటి నేతలకు రాజకీయ భవిష్యత్తు మాత్రం కనుచూపుమేరలో కూడా కనిపించడం లేదు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఇలాంటి కొందరు నేతలు పోటీకి దూరంగా ఉన్నారు. ఎంపీ ఎన్నికల్లో పార్టీ పోటీలోనే లేదు. దీనికి తోడు ప్రస్తుతం జరుగుతున్న పరిషత్ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ చాలా తక్కువ స్థానాలకు పోటీచేస్తుండటం, ప్రస్తుతం పార్టీలో ఉన్న నేతలు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లో కూడా బీఫారాలు అడిగే నాయకుడు కూడా కనిపించలేదు. ఈ నేపథ్యంలో మే 23న ఎన్నికల ఫలితాల తర్వాత వీరి నిర్ణయం ఎలా ఉంటుందనేదే ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది.
చెట్టుకొకరు.. పుట్టకొకరు!
తెలంగాణ ఏర్పాటైన తర్వాత టీడీపీ ప్రభ మసకబారుతూ వస్తోంది. పార్టీ నేతలంతా అటు టీఆర్‌ఎస్‌లోకి లేదంటే కాంగ్రెస్‌లోకి.. మరికొందరు బీజేపీలోకి వెళ్లిపోయారు. రాష్ట్రస్థాయి నుంచి క్షేత్రస్థాయి వరకు ఇదే పరిస్థితి నెలకొంది. మొన్నటి పార్లమెంటు ఎన్నికల సమయంలో నిజామాబాద్‌కు చెందిన మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావు, ఖమ్మం మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావులు కూడా గులాబీ తీర్థం పుచ్చుకున్నారు. అయితే, వేళ్ల మీద లెక్కపెట్టగలిగినంత మంది నేతలు మాత్రం ఇంకా తెలుగుదేశం పార్టీలోనే ఉన్నారు. వారిలో.. ఒకప్పుడు టీడీపీ నం 2గా వెలుగొందిన మాజీ హోంమంత్రి టి.దేవేందర్‌గౌడ్, ఆయన రాజకీయ వారసుడు వీరేందర్‌గౌడ్, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్.రమణ, పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యులు రావుల చంద్రశేఖర్‌రెడ్డి, ఇనుగాల పెద్దిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే కొత్తకోట దయాకర్‌రెడ్డి దంపతులు, రేవూరి ప్రకాశ్‌రెడ్డి, హైదరాబాద్‌కు చెం దిన అరవింద్‌కుమార్ గౌడ్ లాంటి నాయకులు అనివార్య పరిస్థితుల్లో పార్టీలో ఉంటున్నారు.
టీడీపీ అ ధ్యక్షుడి హోదాలో ఎల్.రమణ అడపాదడపా బయట కనిపిస్తున్నా మిగిలిన నేతలు దాదాపుగా అజ్ఞాతంలోనే ఉండి రాజకీయాలు చేస్తున్నారు. ఇప్పుడు వీరి పరిస్థితి ఏంటనేది దానిపై పార్టీలోపలా బయటా చర్చ జరుగుతోంది. తెలంగాణ అసెంబ్లీ ఫలితాలతో ఆశాభంగం కాగా.. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఫలితాలు కీలకంగా మారనున్నాయి. ఏపీలో అధికారం దక్కకపోతే.. వీరిలో కొందరు ఈనెల 23 తర్వాత ఇతర పార్టీల్లో చేరే నిర్ణయం తీసుకోనున్నట్టు తెలుస్తోంది. ‘మా పార్టీ చాలా గడ్డు పరిస్థితుల్లో ఉంది. తెలంగాణలో ఉనికిని చాటుకునేందుకు అవకాశం కూడా లేకుండా పోయింది. పార్టీలో ఉన్న నలుగురైదుగురు నేతలను కూడా లాగేసుకుంటే ఇక టీడీపీ గొడవ ఉండదని టీఆర్‌ఎస్, ఇతర పార్టీలు భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మా పార్టీ త్వరలోనే పూర్తిగా ఖాళీ అయినా ఆశ్చర్యం లేదు’అని టీడీపీలో చాలాకాలంగా ఉన్న రాష్ట్ర స్థాయి నేత ఒకరు వ్యాఖ్యానించడం పార్టీ పరిస్థితికి అద్దం పడుతోంది.
కాంగ్రెస్‌కు బీటీం
పార్టీ అధినాయకుడు చంద్రబాబు నాయుడు కూడా తెలంగాణలో పార్టీని వదిలేశారని టీడీపీ వర్గాల్లో బహిరంగంగానే చర్చించుకుంటున్నారు. కాంగ్రెస్‌కు టీటీడీపీ బీ–టీంగా మారిందని పార్టీ నేతలే అంటున్నారు. కీలక నేతలు పోటీకి దూరంగా ఉండటం, లోక్‌సభ ఎన్నికల్లో అసలు పోటీనే చేయకపోవడంతో ఎవరూ పార్టీలో ఉండలేని పరిస్థితికి టీటీడీపీని చంద్రబాబు తీసుకువచ్చారంటున్నారు. ఈ నేపథ్యంలో పార్టీలో మిగిలిన నేతలైనా ఇంకెన్నాళ్లు పార్టీని పట్టుకుని ఉంటారు.. ఎప్పుడు జంప్‌జిలానీ అంటారో వేచి చూడాల్సిందే!
Comments
Please login to add a commentAdd a comment