
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నివాసం వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. గుంటూరు జిల్లా మాచర్ల సీటు విషయంలో సీఎం చంద్రబాబు ఇరువర్గాల నేతలను పిలిపించి మాట్లాడారు. ఈ సమావేశానికి ఎంపీ రాయపాటి సాంబశివరావు, చలమారెడ్డి, అంజిరెడ్డి, లక్ష్మారెడ్డి హాజరయ్యారు. అంజిరెడ్డిని గెలిపించాలని చలమారెడ్డికి, పార్టీ నేతలకు చంద్రబాబు సూచించారు. సమావేశం అనంతరం అంజిరెడ్డి, చలమారెడ్డికి లక్ష్మారెడ్డి సర్దిచెప్పేందుకు ప్రయత్నించారు. నువ్వు నాకు చెప్పేదేంటని ఆగ్రహంతో లక్ష్మారెడ్డిపై చలమారెడ్డి చేయి చేసుకున్నారు. ఇరు వర్గాల నేతలు ఘర్షణకు దిగడంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.
మరోవైపు చలమారెడ్డి అనుచరులు అంజిరెడ్డి డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేస్తూ సీఎం నివాసంలోకి చొచ్చకెళ్లే ప్రయత్నం చేయడంతో రంగంలోకి దిగిన పోలీసులు వారిని చెదరగొట్టారు. అంజిరెడ్డికి సీటు కేటాయించడంతో చలమారెడ్డి అనుచరులు గత రెండు రోజులు ఆందోళన చేస్తున్నారు. ‘అంజిరెడ్డి వద్దు చలమారెడ్డి ముద్దు’ అంటూ నినదిస్తున్నారు. అంజిరెడ్డి ఎలా గెలుస్తాడో చూస్తానంటూ చలమారెడ్డి మండిపడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment