సాక్షి, అమరావతి : పార్లమెంటు సమావేశాల నేపథ్యంలో టీడీపీ ఎంపీలు విజయోత్సవ ర్యాలీలు నిర్వహించుకోవడంపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. గుంటూరు, మంగళగిరిలో టీడీపీ ఎంపీలు గల్లా జయదేవ్, రామ్మోహన్ నాయుడు ఆదివారం జరిగిన విజయోత్సవ ర్యాలీల్లో పాల్గొన్నారు. టీడీపీ శ్రేణులు జయజయధ్వానాలతో వీరికి విజయోత్సవ ర్యాలీలు నిర్వహించారు.
టీడీపీ ఎంపీల సంబరాలను చూసి జనం విస్తుపోతున్నారు. కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి తీరని అన్యాయం జరిగింది. ప్రత్యేక హోదాపై కేంద్రం ఎలాంటి హామీ ఇవ్వలేదు. ప్రత్యేకంగా నిధులు ఇచ్చింది కూడా ఏమీ లేదు. ఈ విషయమై పార్లమెంటు వేదికగా ఆందోళన డ్రామాలు నిర్వహించిన టీడీపీ ఎంపీలు.. ఇప్పుడు కేంద్రం రాష్ట్రానికి ఏమీ ఇవ్వకపోయినా.. సంబరాలు చేసుకోవడం ఏమిటని ప్రజలు ఆశ్చర్యపోతున్నారు.
నిజానికి ఎంపీ గల్లా జయదేశ్ ప్రత్యేక హోదా అవసరం లేదని పార్లమెంటులో ప్రసంగించారు. హోదాకు బదులు ప్యాకేజీ కావాలని ఆయన కోరారు. గల్లా జయదేవ్ బాగా ప్రసంగించారంటూ టీడీపీ నేతలు ప్రశంసిస్తుండటం గమనార్హం. పార్లమెంటులో నాలుగురోజులపాటు ఆందోళనల పేరిట హైడ్రామా నడిపిన టీడీపీ ఎంపీలు.. ఇప్పుడు కేంద్రం తీరుపై నోరు మెదపడం లేదు. అంతేకాకుండా కేంద్రం దగ్గర అన్నీ సాధించామన్నట్టుగా విజయోత్సవాలు జరుపుకుంటున్నారు. టీడీపీ ఎంపీల తీరును చూసి జనం ఇదేమి చోద్యమని విస్తుపోతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment