గెలుపోటములలో కీలకపాత్ర పోషించేది ఓట్లే. ప్రజాప్రతినిధులను ఎన్నుకునేందుకు రాజ్యాంగం కల్పించిన ఆయుధం ఓటుహక్కు. అలాంటి వజ్రాయుధానికి సంబంధించి నేడు అధికార పార్టీ నేతలు అడ్డదారుల్లో పయనిస్తున్నారు. వైఎస్సార్‌సీపీ ఓట్లను తొలగించి దొంగ దెబ్బ కొట్టాలని తెలుగు తమ్ముళ్లు కుట్ర చేస్తున్నారు. తాజాగా అవి బహిర్గతమయ్యాయి. ప్రజాస్వామ్యబద్ధంగా గెలవడం గగనంగా మారడంతో ఏదో రూపంలో లాభం పొందాలని టీడీపీ ఓట్ల రాజకీయానికి తెర లేపడంతో పలువురు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో వైఎస్సార్‌సీపీకి ఎదురులేకపోవడం.. రానున్న ఎన్నికలలో తాము గెలవడం కష్టమని భావించి అధికార పార్టీ నాయకులు తెరచాటున ఓట్ల తొలగింపు కుట్రలకు దారి తీశారు. వైఎస్సార్‌సీపీ నాయకుల పేరుతోనే ‘తమ్ముళ్లు’ కొత్త అవతారమెత్తి ఓట్లు తొలగించాలంటూ ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేయడంతో అందరూ నివ్వెరపోతున్నారు. ఓట్ల కథ కాస్తా అడ్డం తిరగడంతో తెలుగు తమ్ముళ్లు దిక్కు తెలియక అంతర్మథనంలో పడ్డారు.
సాక్షి కడప : జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ బలమైన శక్తిగా ఉంది. సిట్టింగ్ ఎమ్మెల్యేలతోపాటు ఇతర వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను జిల్లాలో దీటుగా ఎదుర్కోవడం టీడీపీకి కష్టంగా మారింది. పైగా రోజు రోజుకూ బలపడుతుండటం.. ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌ను సీఎం చేయాలని ప్రజలు ఆకాంక్షిస్తుండడంతో ఏం చేయాలో పాలుపోక టీడీపీ ఓట్ల కుట్రలకు తెరలేపుతోంది. ఓట్లను తొలగించడం ద్వారా ఎంతో కొంత వైఎస్సార్‌సీపీని ఎదుర్కొనవచ్చునని పన్నాగం చేస్తున్నారు. ఎన్నికల కమిషన్ ఈనెల 23, 24వ తేదీలలో ఓట్లకు సంబంధించి మార్పులు, చేర్పులకు అవకాశం ఇవ్వడంతో టీడీడీకి చెందిన కొంతమంది ఇదే అదునుగా భావించారు. ఆన్‌లైన్ ద్వారా ఓట్ల తొలగింపు రాజకీయానికి తెరలేపారు. వైఎస్సార్‌సీపీ నాయకులు అప్రమత్తం కావడంతో వ్యవహారం బట్టబయలైంది.
వేల ఓట్ల తొలగింపునకు కుట్ర
జిల్లాలో పది నియోజకవర్గాలు, రెండు పార్లమెంటు స్థానాలు ఉండగా.. పలుచోట్ల ఓట్ల తొలగింపు కుట్ర వ్యవహారం బయటకు వచ్చింది. రాయచోటి నియోజకవర్గంలోని రాయచోటిలో 4వేలు, కమలాపురం నియోజకవర్గాలలో 4,500ఓట్లు, బద్వేల్‌లో 4వేల ఓట్లు, ప్రొద్దుటూరు నియోజకవర్గంలో 1700ఓట్లు, పులివెందుల నియోజకవర్గంలో లింగాలతోపాటు ఇతర చోట్ల వందల సంఖ్యలో ఓట్లు, రైల్వేకోడూరులో 200ఓట్లు, తొలగించాలని అధికారులకు వెళ్లిన ఫిర్యాదులను చూస్తే.. టీడీపీ దొంగ దెబ్బ కొట్టడానికి వేసిన ఎత్తుగడ స్పష్టమవుతోంది. అప్రమత్తమైన వైఎస్సార్‌సీపీ సంబంధిత తహసీల్దార్లతో చర్చించారు. ఆర్‌ఓల దృష్టికి, జిల్లా అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని వైఎస్సార్‌సీపీ నాయకులు, ప్రజాప్రతినిధులు సిద్ధమయ్యారు.
గతంలోనూ ఇలాగే...
జిల్లాలో 2014 ఎన్నికలతో పోలిస్తే గతంలోనూ ఓట్లకు సంబంధించి గోల్‌మాల్ వ్యవహారాలు బయటపడ్డాయి. ఒక్క కడపలోనే 80వేలనుంచి లక్ష ఓట్ల వరకు గల్లంతయ్యాయి. తర్వాత జిల్లా యంత్రాంగం సర్వేలతోపాటు ఇతర ఓటర్ల నమోదుకు ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టి భారీగా నమోదు చేయడంతో సాధారణ పరిస్థితికి వచ్చింది. కడపలోనే కాకుండా మిగిలిన నియోజకవర్గాలలో కూడా ఓట్లు చాలా తొలగిపోయాయి. ఇటీవల డబుల్ ఎంట్రీలు, పేరు ఒకరిది.. ఓటు ఇంకొకరిది లాంటి వ్యవహారాలు కూడా బయడపడ్డాయి. ఎన్నికల నేపథ్యంలో టీడీపీ భారీగా డబుల్ ఎంట్రీలకు పాల్పడిందని అప్పట్లో వైఎస్సార్‌సీపీ తీవ్రస్థాయిలో ఆక్షేపించింది.
ఎన్నికల సంఘం రంగంలోకి దిగితేనే...
రాష్ట్రంతోపాటు జిల్లాలోనూ ఓట్ల తొలగించాలంటూ ఆన్‌లైన్‌లో చేసిన ఫిర్యాదులపై ఎన్నికల సంఘం కొరడా ఝులిపిస్తేనే అసలు వ్యవహారం బయటకు వచ్చే అవకాశం ఉంది. జిల్లా కలెక్టర్ దీనిపై స్పందించి స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాలని పలువురు కోరుతున్నారు. ఎవరు ఆన్‌లైన్‌లో ఓట్లు తొలగించాలని.. వేలల్లో తొలగించాలని కోరడం వెనుక చూస్తే.. అగంతకుల రహస్యం వెనుక టీడీపీ హస్తం ఉన్నట్లు చెప్పగనే తెలుస్తోంది. ఇప్పటికే ఎన్నికల సంఘం దృష్టికి కూడా ఈ వ్యవహారాలు వెళ్లినట్లుగా తెలియవచ్చింది. వైఎస్సార్ సీపీ నాయకులు కూడా అధికారుల దృష్టికి తీసుకెళ్లనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment