నితీశ్ కుమార్, సుశీల్ కుమార్
పాట్నా : శ్రీజన్ కుంభకోణంలో బిహార్ సీఎం నితీశ్ కుమార్, డిప్యూటీ సీఎం సుశీల్ మోదీల హస్తం ఉందంటూ ఆర్‌జేడీ నేత, బీహార్ మాజీ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్ సంచలన ఆరోపణలు చేశారు. తన ఆరోపణలకు రుజువులుగా ఆయన శ్రీజన్ బ్యాంక్ స్టేట్‌మెంట్లను ఆయన ట్వీట్‌కు జత చేశారు. సుశీల్ మోదీ సోదరి రేఖ, మేనకోడలు ఊర్వశి శ్రీజన్ కుంభకోణంలో కోట్ల రూపాయలను లబ్దిపొందినట్లు వెల్లడించారు. దాదాపు 2,500 కోట్ల రూపాయల కుంభకోణంలో సీబీఐ నితీశ్, సుశీల్‌లను ఎందుకు విచారించదని ప్రశ్నించారు.
ఇటీవల ఓ మీడియా సమావేశంలో సుశీల్ మోదీ, తేజస్వీ యాదవ్‌పై అవినీతి ఆరోపణలు గుప్పించారు. దేశంలోనే ప్రముఖ స్టీల్ కంపెనీ స్టోరేజీ ఏజెంట్‌గా ఉంటూ.. ఈ విషయాన్ని 2015లో జరిగిన బిహార్ అసెంబ్లీ ఎన్నికల అఫిడవిట్‌లో తేజస్వీ పేర్కొనలేదన్నారు. ఆదాయాన్ని చూపకుండా పన్నులు ఎగవేస్తున్నారని ఆరోపించారు. ఈ ఆరోపణలపై స్పందించిన తేజస్వీ అసత్యాలను ప్రచారం చేయడంలో డిప్యూటీ సీఎం మాస్టర్ అని అన్నారు. సుశీల్ చేసిన ఆరోపణలపై విచారణ జరిపించి, నిరూపించాలని సవాలు విసిరారు.
ఏంటీ శ్రీజన్ కుంభకోణం..?
‘శ్రీజన్’ మహిళలకు ట్రైనింగ్ ఇచ్చే ఓకేషనల్ సంస్థ. 2004 నుంచి 2013 మధ్య కాలంలో మహిళా నైపుణ్యాభివృద్ధి కోసం కేటాయింపబడిన ప్రభుత్వ నిధులను వివిధ అకౌంట్లలోకి తరలించారు. ఇందుకు పలు బ్యాంకులు, రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు సహకరించారు. తీవ్ర ఆరోపణల నేపథ్యంలో సీబీఐ బీహార్‌కు చెందిన శ్రీజన్ మహిళా వికాస్ సహయోగ్ సమితి, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఇండియన్ బ్యాంక్ ఉన్నతాధికారులపై కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపట్టింది.
Comments
Please login to add a commentAdd a comment