తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ (ఫైల్ ఫోటో)
హైదరాబాద్ : తెలంగాణ రాజకీయం హీటెక్కింది. గత కొన్ని రోజులుగా వస్తున్న ఊహాగానాలకు తెరదించుతూ... తెలంగాణ తొట్టతొలి అసెంబ్లీని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు నేడు రద్దు చేశారు. తొమ్మిది నెలలు ముందుగా అసెంబ్లీని రద్దు చేయడమే కాకుండా.. మరో సంచలన నిర్ణయాన్ని కూడా కేసీఆర్ ప్రకటించారు. అసెంబ్లీ రద్దు రోజే 105 అభ్యర్థుల జాబితాను వెల్లడించారు. కేసీఆర్ తీసుకున్న ఈ నిర్ణయంపై సోషల్ మీడియా యూజర్ల నుంచి మిశ్రమ స్పందన వస్తుంది. కొంతమంది అభినందనలు చెబుతుండగా.. మరికొంత మంది తీవ్రంగా విమర్శిస్తున్నారు. కేసీఆర్ మంచి నిర్ణయం తీసుకున్నారని, ముందస్తు ఎన్నికలకు శుభాకాంక్షలంటూ కొందరు యూజర్లు తెలుపుతున్నారు. ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ తీసుకునే నిర్ణయాల్లో రాజకీయం మాత్రమే ఉంటుందని, అదే టీఆర్‌ఎస్ పార్టీ తీసుకునే నిర్ణయాల్లో రాజకీయం, తెలంగాణ రెండూ ఉంటాయని, ఈసారి మా ఓటు టీఆర్‌ఎస్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. అయితే రాజకీయంలో హీట్ తప్ప ఇంకేమీ మార్పు ఉండదని, మన పని మనం చేసుకుంటూ.. ఓటింగ్ రోజు మన అభిప్రాయం చెప్పడమే మన బాధ్యత అంటూ మరో యూజర్ కామెంట్ చేశాడు.
ప్రజాపాలన చేయలేక తప్పించుకున్న వ్యక్తికి మరోసారి పట్టం కట్టవద్దని, ఓడిపోవడానికి ఎందుకంత తొందర అంటూ కూడా అసెంబ్లీని రద్దు చేసిన కేసీఆర్‌ను విమర్శిస్తున్నారు. అభినవ నిజాం పాలన నేటితో అంతమైందని, తెలంగాణ ప్రజల్లో సంతోషం వెల్లువెత్తుతుందంటూ కామెంట్లు పెడుతున్నారు. నయా నిజాం విమోచన సెప్టెంబర్ 6వ తేదీ అంటూ వ్యాఖ్యానిస్తున్నారు. ప్రజాభిప్రాయ సేకరణ లేకుండానే అసెంబ్లీని ఎలా రద్దు చేశారని, 2019లో మీకేం పని ప్రజలతో అంటున్నారు. ముందస్తు ఎన్నికలకు ఎందుకు వెళ్తున్నారో ప్రజలకు సమాధానం చెప్తే బాగుంటుందని మరో యూజర్ కామెంట్ పెట్టాడు. మరోవైపు కేసీఆర్ లక్కీ నెంబర్ ఆరు అని, అందుకే నేడు అసెంబ్లీని రద్దు చేసి, అభ్యర్థుల జాబితాను ప్రకటించేశారని మరో యూజర్ కామెంట్ చేశాడు. ‘అన్నా మీది మాస్టర్ బ్రెయిన్, కాంగ్రెస్‌కు కొంచెం కూడా సమయం ఇవ్వడం లేదు’ అని మెచ్చుకుంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment