
గాంధీ ఆస్పత్రి: డెంగీ, చికున్ గున్యా, స్వైన్‌ఫ్లూ, మలేరియా వంటి విష జ్వరాలకు తెలంగాణ కేరాఫ్ అడ్రస్‌గా మారిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ ఆరోపించారు. నిరుపేదలు జ్వరాలతో వణుకుతుంటే ప్రభుత్వం చోద్యం చూస్తోందని విమర్శించారు. బీజేపీ నాయకులతో కలిసి శని వారం ఆయన సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిని సందర్శించి ఇన్‌ఫెక్షన్ వార్డులు, ఐసీయూలను పరిశీలించారు. అక్కడ చికిత్స పొందుతున్న రోగులతో మాట్లాడారు. వారికి అందిస్తున్న వైద్యసేవలపై ఆరా తీశారు.
అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వం, అధికారుల నిర్లక్ష్యంతో రాష్ట్రంలో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించే పరిస్థితులు న్నాయని మండిపడ్డారు. హైదరాబాద్‌తోపాటు మున్సిపాలిటీలు, గ్రామాల్లో పారిశుధ్య లోపంతో విషజ్వరాలు వ్యాపించి ప్రజలు అల్లాడుతుంటే ప్రభుత్వం పట్టనట్లు వ్యవహరిస్తోందని ఆరోపించారు. గులాబీ జెండాకు ఓనర్లం మేమేనని ఆరోగ్య మంత్రి పోటీ పడుతుంటే, యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో తన ముఖచిత్రాన్ని చెక్కించే పనిలో సీఎం కేసీఆర్ బిజీగా ఉన్నారని ఎద్దేవా చేశారు. ఆస్పత్రుల్లో సరైన వసతులు లేవని మందులు, సిబ్బంది కొరతతో రోగులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. టీఆర్‌ఎస్ మంత్రులు అధికార మత్తులో వెటకారంగా మాట్లాడుతున్నారని, రోగుల అవస్థలను పట్టించుకోకుండా వ్యంగ్యంగా మాట్లాడితే సరైన రీతిలో బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని వ్యాఖ్యానించారు.