సాక్షి, హైదరాబాద్: ‘నేను ఇంట్లో కూర్చోను. ప్రజల్లోనే ఉంటా. తెలంగాణలో బీజేపీని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా పనిచేస్తా. టీఆర్‌ఎస్, కేసీఆర్ ప్రజావ్యతిరేక విధానాలపై పోరాటం చేస్తా. శివాజీ వారసులుగా మేం వస్తాం. ఔరంగజేబు వారసులుగా ఎంఐఎం, టీఆర్‌ఎస్ వస్తోంది. విజయమో వీరస్వర్గమో తేల్చుకుంటా’ అని రాష్ట్ర బీజేపీ నూతన అధ్యక్షుడు బండి సంజయ్ స్పష్టం చేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమితులయ్యాక తొలిసారి హైదరాబాద్ వచ్చిన ఆయనకు బీజేపీ శ్రేణులు పెద్ద ఎత్తున స్వాగతం పలికాయి. తొలుత గన్‌పార్క్ వద్ద తెలంగాణ అమరవీరుల స్తూపానికి ఆయన నివాళులు అర్పించి.. పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. అభినందన సభాస్థలిలో ఏర్పాటు చేసిన సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్, సుష్మాస్వరాజ్ చిత్రపటాలకు నివాళులు అర్పించారు. కాగా, సంజయ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఆదివారం బాధ్యతలు స్వీకరించలేదు. ముహూర్తం చూసుకుని స్వీకరించనున్నట్లు సమాచారం.
కాషాయజెండా ఎగరేయడమే లక్ష్యం..
నమ్మిన సిద్ధాంతం కోసం, కాషాయ జండా రెపరేపలాడించేందుకు ఎందరో కార్యకర్తలు ప్రాణాలు కోల్పోయారని బండి సంజయ్ పేర్కొన్నారు. వారి ఆశయ సాధనకోసం కృషి చేస్తానని చెప్పారు. గోల్కొండ కోటపై కాషాయజెండాను రెపరెపలాడించడమే లక్ష్యంగా ముందుకు సాగుతానని తెలిపారు. టీఆర్‌ఎస్, ఎంఐఎం విధ్వంసాన్ని అడ్డుకునేందుకు, రాష్ట్రంలో ప్రత్యామ్నాయంగా బీజేపీ అధికారంలోకి రావాల్సిందేనని అభిప్రాయపడ్డారు. భైంసా సంఘటనను మరచిపోబోమని, తమను కాపాడాలని పిల్లలు, మహిళలు, తమ్ముళ్లు చేసిన ఆర్తనాదాలు ఇంకా తన కళ్ల ముందు కదలాడుతున్నాయని పేర్కొన్నారు. భైంసాకు వచ్చి, అక్రమ కేసులతో జైలుకు వెళ్లిన తమ్ముళ్లను గుండెకు హత్తుకుంటానని చెప్పారు.
ఆ తుక్‌డేగాళ్ల సంగతి చూస్తా..
‘కేసీఆర్ సంగతేందో.. ఎంఐఎం తుక్‌డేగాళ్ల సంగతేందో చూస్తా. బండి సంజయ్ రూటు మార్చడు. అడ్డదారిలో పోయే అలవాటు లేదు. నమ్మిన సిద్ధాంతం కోసం, పేదల కోసం పని చేస్తా, కార్యకర్తలకు అండగా ఉంటా. ఎన్ని కేసులైనా ఎదుర్కొంటా. బీజేపీ మతతత్వ పార్టీ అని, భయంకరమైన హిందువునంటూ కేసీఆర్ చెప్పుకొంటున్నారు. కొడుకును సీఎం చేసేందుకే ఆ యాగాలు చేస్తున్నారు. స్వార్థంతో యాగాలు చేస్తే హిందువుగా గుర్తించరు. ఆయన టూత్ పాలిష్ మాటలను ప్రజలు నమ్మరు’అని సంజయ్ మండిపడ్డారు.
ఫాంహౌజ్‌లో ముద్రిస్తున్నవా?
‘ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా, లక్షన్నర కోట్లు ఇచ్చినా ఆ నెపం కేంద్రంపై నెడుతున్నారు. కేంద్రం వాటా లేకుండా ఇస్తున్న పథకాలేంటో చెప్పాలి. రాష్ట్రంలో పథకాలకు ఇచ్చే డబ్బు ఎక్కడిది. ఎవడబ్బ సొమ్మని ఇస్తున్నావు. ఫాంహౌజ్‌లో ముద్రించి ఇస్తున్నావా? కేంద్రం ఇచ్చే డబ్బులకు కేసీఆర్ లెక్కలు చెప్పాలి. బీజేపీ అధ్యక్షుడిగా, ఎంపీగా రాష్ట్రానికి నిధులు ఇప్పిస్తా.. దమ్ముంటే నాతో రా.. అందరికీ కరోనా భయం పట్టుకుంటే కేసీఆర్‌కు బీజేపీ భయం పట్టుకుంది. కరోనాకు పారాసిటమాల్ చాలు అన్న కేసీఆర్ మాటలకు దేశమంతా నవ్వుకుంటోంది’అంటూ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
మానవత్వం లేని మృగం
‘మానవత్వం లేని మృగంగా సీఎం వ్యవహరిస్తున్నారు. కొండగట్టు ప్రమాదంలో అంతమంది చనిపోతే కనీసం స్పందించలేదు. ఇలాంటి ప్రభుత్వం మనకు అవసరమా.. ఇలాంటి సీఎం అవసరమా? త్వరలోనే టీఆర్‌ఎస్ గడీలను కూల్చేస్తాం. ఖబడ్దార్ కేసీఆర్! కేసీఆర్ కౌంట్ డౌన్ స్టార్టయింది. పోరగాళ్లు.. పోరగాళ్లు అంటున్నావు. ఆ పోరగాళ్ల రక్తంతోనే అధికారంలోకి వచ్చావు. ఆ పోరగాళ్లే నీకు ఘోరీ కడతారు.
అది బీజేపీలోనే సాధ్యం: బీజేపీ మాజీ అధ్యక్షుడు లక్ష్మణ్
సంజయ్ లాంటి వ్యక్తి రాష్ట్ర అధ్యక్షుడు అయ్యాడంటే అది బీజేపీలోనే సాధ్యమని ఆ పార్టీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు కె.లక్ష్మణ్ పేర్కొన్నారు. రాష్ట్ర అధ్యక్షులైన తమ పార్టీ నేతల్లో ఎవరికీ రాజకీయ నేపథ్యం లేదని చెప్పారు. గ్రేటర్ ఎన్నికలు వేదికగా టీఆర్‌ఎస్‌కు రాజకీయ సమాధి కట్టాలని పిలుపునిచ్చారు. కేసీఆర్, ఒవైసీ కుటుంబాలు తెలంగాణను శాసిస్తున్నాయని, ఈ రెండు కుటుంబాల నుంచి తెలంగాణను విముక్తి చేసేందుకు పార్టీ కార్యకర్తలు సిద్ధం కావాలని కోరారు.
సంజయ్‌ను పార్టీ అధ్యక్షుడిగా చేయాలని హైకమాండ్‌కు చెప్పానని ఎంపీ ధర్మపురి అర్వింద్ చెప్పారు. పార్టీలోని యువత అంతా కలసి టీఆర్‌ఎస్ ముక్కు కట్ చేస్తారని వ్యాఖ్యానించారు. బైంసా బాధితుల కోసం రూ.5 లక్షల చెక్కును ఆయన అందించారు. కార్యక్రమంలో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌రావు, మాజీ మంత్రి డీకే అరుణ, మాజీ ఎంపీలు గరికపాటి రామ్మోహనరావు, వివేక్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment