
సాక్షి, హైదరాబాద్ : కాంగ్రెస్ నేతలు రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆర్థిక వైఫల్యాలపై కాంగ్రెస్ నేతలు గవర్నర్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ భేటీలో రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ కుంతియా, సీఎల్పీ నాయకుడు భట్టి విక్రమార్క, సీనియర్ నాయకులు అంజన్‌కుమార్ యాదవ్, జనారెడ్డిలతో పాటు ఇతర నాయకులు ఉన్నారు. అంతకు ముందు గాంధీభవన్ నుంచి రాజ్‌భవన్‌కు ర్యాలీగా బయలుదేరిన కాంగ్రెస్ శ్రేణులను పోలీసులు అడ్డుకున్న సంగతి తెలిసిందే. దీంతో గాంధీభవన్ పరిసరాల్లో కాసేపు ఉద్రిక్తత నెలకొంది.
కాగా, కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా ఆందోళనలకు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. అందులో భాగంగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ చలో రాజ్‌భవన్‌కు పిలుపునిచ్చింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌కు వినతిపత్రం ఇచ్చేందుకు గాంధీభవన్ నుంచి రాజ్‌భవన్ వరకు కాంగ్రెస్ శ్రేణులు ర్యాలీగా బయలుదేరాయి. ఈ ర్యాలీలో రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ ఆర్‌సీ కుంతియా, సీఎల్పీ నేత భట్టు విక్రమార్క, సీనియర్ నాయకులు జనారెడ్డిలు పాల్గొన్నారు. అయితే ఈ ర్యాలీ గాంధీభవన్ నుంచి కొద్దిగా ముందుకు రాగానే ఈ ర్యాలీకి అనుమతి లేదని పోలీసులు కాంగ్రెస్ శ్రేణులను అడ్డుకున్నారు. పలువురు కాంగ్రెస్ శ్రేణులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో గాంధీభవన్ పరిసరాల్లో ఉద్రిక్తత నెలకొంది. అయితే 11 మంది కాంగ్రెస్ నేతలకు మాత్రం గవర్నర్‌ను కలిసేందుకు అనుమతిచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment