సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పరిషత్ ఎన్నికల పోరుకు నగారా మోగింది. మూడు విడతల్లో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ వి. నాగిరెడ్డి శనివారం నోటిఫికేషన్ జారీ చేశారు. వచ్చే నెల 6, 10, 14 తేదీల్లో మూడు దశల్లో 32 జిల్లాలు, మండలాల పరిధిలోని 538 జెడ్పీటీసీ, 5,817 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరుగుతాయి. మూడు విడతల ఎన్నికల ఫలితాలను ఒకేసారి మే 27న ప్రకటిస్తారు. ఫలితాల ప్రకటన తర్వాతే జిల్లా ప్రజాపరిషత్ (జెడ్పీపీ) చైర్‌పర్సన్లు, మండల ప్రజాపరిషత్ (ఎంపీపీ) అధ్యక్షుల ఎన్నికకు సంబంధించిన తేదీని రాష్ట్ర ఎన్నికల కమిషన్ (ఎస్‌ఈసీ) ప్రకటిస్తుంది.
ఎన్నికలకు సంబంధించి తొలి నోటీస్‌ను సోమవారం (22న), రెండో దశ ఎన్నికల నోటీస్‌ను 26న, తుది దశ ఎన్నికల నోటీస్‌ను 30న విడుదల చేయనుంది. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నోటిఫికేషన్ జారీతో శనివారం నుంచే పంచాయతీరాజ్ చట్టం అమల్లో ఉన్న గ్రామీణ ప్రాంతాల్లో పరిషత్ ఎన్నికల కోడ్ అమల్లోకి (ప్రస్తుతం లోక్‌సభ ఎన్నికల కోడ్ కూడా అమల్లో ఉంది) వచ్చింది. మే 27న ఫలితాలు వెలువడే వరకు ఈ కోడ్ అమల్లో ఉంటుంది.
40 ఎంపీటీసీ స్థానాల్లో ఎన్నికలు పెండింగ్...
ప్రస్తుతం 32 జిల్లా పరిషత్‌ల పరిధిలో మొత్తం 539 జెడ్పీటీసీ స్థానాలున్నాయి. వాటిలో ములుగు జిల్లాలోని మంగపేట మండలం జెడ్పీటీసీ షెడ్యూల్ ఏరియాలోకి వస్తుందా లేదా అన్న వివాదం నెలకొనడంతో ఆ రిజర్వేషన్‌పై హైకోర్టు స్టే ఇచ్చింది. ఈ కారణంగా ఈ స్థానానికి ఎన్నిక జరగడం లేదు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 5,857 ఎంపీటీసీ స్థానాలు ఉండగా వాటిలో మహబూబ్‌నగర్ జిల్లాలోని జడ్చర్ల ఎంపీపీలోని 15 ఎంపీటీసీల పదవీకాలం వచ్చే ఏడాది మే 3 వరకు ఉంది. అలాగే భద్రాద్రి జిల్లాలోని బూర్గంపహాడ్, భద్రాచలం ఎంపీపీల పరిధిలోని 11 ఎంపీటీసీల పదవీకాలం వచ్చే ఏడాది జూలై 2 వరకు ఉండటం, ములుగు జిల్లాలోని మంగపేట ఎంపీపీ పరిధిలోని 14 ఎంపీటీసీ స్థానాల విషయంలో కోర్టు వివాదం నెలకొనడంతో మొత్తం 40 ఎంపీటీసీ స్థానాల్లో ఎన్నికలు నిర్వహించట్లేదు.
రెండింటికీ పోటీ చేయొచ్చు: వి. నాగిరెడ్డి
జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు అభ్యర్థులు ఏకకాలంలో పోటీ చేయొచ్చని కమిషనర్ వి. నాగిరెడ్డి వెల్లడించారు. ఈ స్థానాల్లోనూ ఒకటికి మించి నామినేషన్లు దాఖలు చేసినా, ఉపసంహరణ నాటికి ఒక దాంట్లో మినహా అన్నింట్లోనూ ఉపసంహరించుకోవాల్సి ఉంటుందన్నారు. ఒకటికి మించి పోటీ చేస్తే అన్నిచోట్లా అభ్యర్థిత్వాన్ని రద్దు చేస్తామని చెప్పారు. పరిషత్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేశాక శనివారం ఎస్‌ఈసీ కార్యాలయంలో కార్యదర్శి ఎం. అశోక్ కుమార్, సంయుక్త కార్యదర్శి జయసింహారెడ్డిలతో కలసి నాగిరెడ్డి విలేకరులతో మాట్లాడారు. పంచాయతీ ఎన్నికల్లో వార్డు సభ్యులు, సర్పంచ్‌లుగా గెలుపొందిన వారు సైతం ఈ ఎన్నికల్లో పోటీ చేయొచ్చన్నారు.
అయితే గెలిచాక ఏదో ఒక సభ్యత్వాన్ని మాత్రమే ఉంచుకొని మిగతా వాటికి రాజీనామా చేయాల్సి ఉంటుందన్నారు. విడతలవారీగా ఈ నెల 22, 26, 30 తేదీల్లో ఒక్కో జెడ్పీటీసీ, మూడేసి ఎంపీటీసీ స్థానాలకు రిటర్నింగ్ అధికారులు నోటీస్‌లు జారీ చేస్తారని ఆయన వివరించారు. నోటీస్ విడుదల నాటి నుంచి మూడురోజులపాటు నామినేషన్ల స్వీకరణ, నాలుగోరోజు సాయంత్రం 3 గంటల వరకు నామినేషన్ల పరిశీలన, అదే రోజున సాయంత్రం 5 గంటలకు అర్హులైన అభ్యర్థుల జాబితా సిద్ధం, ఐదో రోజున దానిపై అప్పీళ్ల స్వీకరణ ఉంటుందన్నారు. ఎంపీటీసీ అభ్యర్థులు ఆర్డీవో, సబ్ కలెక్టర్లకు, జెడ్పీటీసీ అభ్యర్థులు కలెక్టర్లకు అప్పీల్ చేసుకోవాలని, ఏడో రోజున వాటిని పరిష్కరిస్తారన్నారు.
ఆన్‌లైన్‌లో నామినేషన్ల దాఖలు సదుపాయం
ప్రస్తుత జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో ఆన్‌లైన్‌లో నామినేషన్ల దాఖలు సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చినట్లు నాగిరెడ్డి తెలిపారు. ఆన్‌లైన్‌లో నింపి అప్‌లోడ్ చేసిన నామినేషన్ పత్రం ప్రింట్‌ఔట్‌పై అభ్యర్థి సంతకం చేసి రిటర్నింగ్ అధికారికి సమర్పించాల్సి ఉంటుందన్నారు. అభ్యర్థి కానీ, ఆయన తరఫున ఎవరైనా ప్రతిపాదకుడు ఈ నామినేషన్‌ను ఆర్వోకు అందజేయాలని చెప్పారు. పరిషత్ ఎన్నికల సమాచారం పొందుపరిచేందుకు రాష్ట్రస్థాయిలో ఎస్‌ఈసీతోపాటు జిల్లా స్థాయిల్లోనే కాల్‌సెంటర్లను ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు.
బ్యాలెట్ పేపర్ల పద్ధతిలోనే ఈ ఎన్నికలు నిర్వహిస్తున్నామన్నారు. గత కొన్ని దశాబ్దాలుగా కొనసాగుతున్న విధంగానే ఎంపీటీసీలకు గులాబీ రంగు, జెడ్పీటీసీలకు తెలుపు రంగు బ్యాలెట్ పేపర్‌ను ఉపయోగిస్తున్నట్లు చెప్పారు. 2013లో పంచాయతీ ఎన్నికలు, 2014లో పరిషత్ ఎన్నికల్లో పోటీ చేసిన వ్యయంపై తుది వివరాలు సమర్పించని 12,745 మందిని అనర్హులుగా ప్రకటించామని, ఈ ఆదేశాలను సవాల్ చేస్తూ హైకోర్టు నుంచి ఉత్తర్వులు తెచ్చుకున్న వారికి మినహాయింపు ఉంటుందన్నారు.
జెడ్పీటీసీకి రూ. 4 లక్షలు...
జెడ్పీటీసీ అభ్యర్థుల వ్యయ పరిమితి రూ. 4 లక్షలు, ఎంపీటీసీ అభ్యర్థుల వ్యయ పరిమితి రూ. లక్షన్నరగా ఉందని నాగిరెడ్డి తెలిపారు. నోటిఫికేషన్ వెలువడే నాటి దాకా ఓటర్ల జాబితాలో నమోదైన వారు పరిషత్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు, ఓటు వేసేందుకు అవకాశం ఉంటుందని చెప్పారు.
ఎన్నికలు జరిగే స్థానాలు
మే 6న తొలి విడత ఎన్నికల్లో 197 జెడ్పీటీసీలు, 2,166 ఎంపీటీసీలు
మే 10న రెండో విడత ఎన్నికల్లో 180 జెడ్పీటీసీలు, 1,913 ఎంపీటీసీ
మే 14న తుది విడత ఎన్నికల్లో 161 జెడ్పీటీసీలు, 1,738 ఎంపీటీసీ
మొత్తం: 538 జెడ్పీటీసీలు 5,817 ఎంపీటీసీలు
ఏయే జిల్లాల్లో ఎన్ని విడతలు...
మూడు విడతల్లో ఎన్నికలు జరిగే జిల్లాలు 27:
నల్లగొండ, నిజామాబాద్, సంగారెడ్డి, ఖమ్మం, కామారెడ్డి, సూర్యాపేట, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, జనగామ, జయశంకర్ భూపాలపల్లి, మహబూబాబాద్, వరంగల్ రూరల్, ములుగు, ఆదిలాబాద్, కొమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, భద్రాద్రి కొత్తగూడెం, నాగర్‌కర్నూల్, వనపర్తి, మెదక్, రంగారెడ్డి, వికారాబాద్, జోగుళాంబ గద్వాల, నారాయణపేట, జగిత్యాల,
రాజన్న సిరిసిల్ల.
రెండు విడతల్లో ఎన్నికలు జరిగే జిల్లాలు 4:
కరీంనగర్, పెద్దపల్లి, మహబూబ్‌నగర్,
వరంగల్ అర్బన్
ఒకే విడతలో ఎన్నికలు జరిగే జిల్లా 1:
మేడ్చల్–మల్కాజిగిరి
Comments
Please login to add a commentAdd a comment