
విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న మహమూద్ అలీ
మెదక్ మున్సిపాలిటీ: అధికార దాహంతోనే కాంగ్రెస్, టీడీపీ రాజకీయ విలువలను దిగజార్చి అక్రమ పొత్తులు పెట్టుకుంటున్నాయని ఆపద్ధర్మ డిప్యూటీ సీఎం మహమూద్ అలీ ఆరోపించారు. ఆదివారం రాత్రి మెదక్‌కు వచ్చిన ఆయన టీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తెలంగాణకు అన్యాయం చేసిన కాంగ్రెస్, టీడీపీలకు ఓట్లు వేయొద్దని ప్రజలను కోరారు. ఎన్టీఆర్ హయాంలో కాంగ్రెస్ దొంగపార్టీ అన్నారని, ప్రస్తుతం టీడీపీ కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకోవడం సిగ్గుచేటన్నారు.
14 ఏళ్లపాటు తెలంగాణ కోసం పోరాటం జరిగిందన్నారు. బంగారు తెలంగాణ కోసం సీఎం కేసీఆర్ అహర్నిశలు కృషి చేస్తున్నారన్నారు. రైతులకు 24గంటల నిరంతర కరెంట్ ఇస్తున్నట్లు తెలిపారు. రైతుల సంక్షేమ కోసం ప్రభుత్వం రూ.12వేల కోట్లు కేటాయించిందన్నారు. అలాగే మైనార్టీల సంక్షేమం కోసం రూ.2వేల కోట్లు కేటాయించినట్లు తెలిపారు. తెలంగాణ వచ్చాక హిందూ ముస్లింలంతా కలిసి మెలిసి జీవిస్తున్నారని అన్నారు.
పది జిల్లాలున్న తెలంగాణ రాష్ట్రాన్ని 21జిల్లాలు పెంచి 31జిల్లాలుగా ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. పరిపాలన సౌలభ్యం కోసం రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు చేసినట్లు గుర్తు చేశారు. మెదక్ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి పద్మాదేవేందర్‌రెడ్డి తెలంగాణ ఉద్యమంలో అలుపెరగని పోరాటం చేశారని, ఆమెను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ సమావేశంలో మాజీ డిప్యూటీస్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి, టీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకులు దేవేందర్‌రెడ్డి, మున్సిపల్‌చైర్మన్ మల్లికార్జున్‌గౌడ్ తదితరులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment