సాక్షి, తాడేపల్లి : రాజధాని విషయంలో టీడీపీ నాయకులు పెయిడ్ ఆర్టిస్ట్‌లను తీసుకొచ్చి ఉద్యయం చేయిస్తున్నారని రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ధ్వజమెత్తారు. రాజధాని విషయంలో టీడీపీ మీడియా అతిగా చూపిస్తోందని, రాజధానిలో రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఉద్యమాలు చేయిస్తున్నారని విమర్శించారు. మంగళవారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. అద్భుతమైన రాజధానిని నిర్మిస్తానని చెప్పి చంద్రబాబు రైతులను మోసం చేశారని మండిపడ్డారు. రాజధానిలో టీడీపీ నేతలు ఇన్‌సైడర్ ట్రేడింగ్‌కు పాల్పడ్డారని, తన బినామీలు కొన్న భూములకు రేట్లు పలకడం కోసం ప్రపంచ స్థాయి రాజధాని నిర్మిస్తామని చంద్రబాబు నమ్మబలికారని దుయ్యబట్టారు.
రాజధాని ప్రజలను బాబు రెచ్చగొడుతున్నారు
చంద్రబాబు రాజధాని పూర్తి చేసి ఉంటే రాజధాని తరలించే పరిస్థితి వచ్చేది కాదని, ఢిల్లీని తలదన్నే విధంగా రాజధాని నిర్మిస్తామని బాబు గ్రాఫిక్స్ చూపించారని మండిపడ్డారు. రాజధాని ప్రజలను చంద్రబాబు రెచ్చగొడుతున్నారని, శ్రీబాగ్ ఒడంబడిక ప్రకారం హైకోర్టు రాయలసీమలో ఏర్పాటు చేయాలని స్పష్టం చేశారు. రూ. లక్షా 70 వేల కోట్లు అప్పు తెచ్చి కేవలం అయిదు వేల కోట్లు రాజధానికి చంద్రబాబు ఖర్చు చేశారని విమర్శించారు. ఢిల్లీ, ముంబై, చెన్నై, హైదరాబాద్ లాంటి రాజధాని ఆంధ్రప్రదేశ్‌కు అవసరం లేదా అని ప్రశ్నించారు. ప్రపంచ స్థాయి రాజధాని నిర్మిస్తామని అంటేనే సీఎం జగన్ అమరావతికి మద్దతు తెలిపారని స్పష్టం చేశారు. రియల్ ఎస్టేట్ వ్యాపారులు చందాలు వసూళ్లు చేసి రాజధానిలో ఉద్యమాన్ని అమరావతిలో నడిపిస్తున్నారని దుయ్యబట్టారు.
అదే విధంగా.. మూడు లక్షల కోట్ల అప్పుతో మరొక లక్ష కోట్లు అప్పు చేస్తే రాజధాని నిర్మిస్తే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏం కావాలని నిలదీశారు. ఇప్పటికే అభివృద్ధి చెందిన వైజాగ్‌ను రాజధానిగా చేసుకుంటే ఆర్థికంగా ఎలాంటి ఇబ్బంది ఉండదని, సీఎం జగన్ ప్రజా ఆకాంక్షకు అనుగుణంగానే నిర్ణయాలు తీసుకుంటున్నారని పేర్కొన్నారు. గత పాలకులు రెండు లక్షల కోట్లు అప్పు తెచ్చి కమిషన్లు దండుకున్నారని విమర్శించారు. పార్టీలకు అతీతంగా ప్రజలు మూడు రాజధానులను స్వాగతిస్తున్నారని.. చిరంజీవి, జీవీఎల్, కేఈ, గంటా వంటి వారు జీఎస్ రావు కమిటీని స్వాగతిస్తున్నారని తెలిపారు. ప్రజలు అందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయం కేబినేట్ భేటీ తరువాత వస్తుందని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment