
రాహుల్ గాంధీని ప్రజల మధ్య నిల్చోబెట్టి కొట్టాలని సావర్కర్ మనవడు రంజిత్ సావర్కర్ మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రేను కోరారు.
ముంబై: హిందూత్వ యోధుడు వీడీ సావర్కర్‌ను అవమానించిన కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని ప్రజల మధ్య నిల్చోబెట్టి కొట్టాలని సావర్కర్ మనవడు రంజిత్ సావర్కర్ మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రేను కోరారు. ఎవరైనా సావర్కర్‌ను అవమానిస్తే పబ్లిక్‌లో కొట్టాలని గతంలో ఉద్ధవ్ ఠాక్రే పిలుపునిచ్చిన విషయాన్ని రంజిత్ గుర్తు చేశారు. రంజిత్ సావర్కర్ ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. ‘మా తాత బ్రిటిష్ వారికి క్షమాపణ చెప్పారని రాహుల్ పదేపదే అంటున్నారు. అది నిజం కాదు. జైలు నుంచి విడుదల అయ్యేందుకు బ్రిటిష్ వారు పెట్టిన నిబంధనలకు ఆయన అంగీకరించారు. అంతేకానీ క్షమాపణ చెప్పలేదు’ అని వివరణ ఇచ్చారు.
‘పౌరసత్వం’ సావర్కర్‌కు భిన్నం: శివసేన
బీజేపీ తీసుకొచ్చిన పౌరసత్వ చట్టం హిందూవాద నాయకుడైన వీర్ సావర్కర్ ఆలోచనలకు భిన్నమైనదని మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే అన్నారు. మహిళలకు రక్షణ లేకపోవడం, నిరుద్యోగం, వ్యవసాయ సమస్యలను కప్పిపుచ్చేందుకు బీజేపీ ‘పౌరసత్వ’ వాదనను తెరపైకి తెచ్చిందని అన్నారు. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకూ ఒకే దేశం ఉండాలని సావర్కర్ ఆకాంక్షించారని, ఇప్పుడు ఆయన ఆలోచనలకు తూట్లు పొడిచేలా ఇతర దేశాల మైనారిటీలను భారత్‌లోకి బీజేపీ ఆహ్వాని స్తోందని అన్నారు. (చదవండి: నా పేరు రాహుల్ సావర్కర్ కాదు)