కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి డీకే శివకుమార్
సాక్షి, బెంగళూరు : కర్ణాటకలో ఎన్నికల తర్వాత తలెత్తిన అనూహ్య పరిణామాల నేపథ్యంలో బీజేపీకి అధికారం దక్కకుండా చేసేందుకు జేడీఎస్-కాంగ్రెస్ పార్టీలు పొత్తు పెట్టుకొని సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్న సంగతి తెలిసిందే. ఎన్నికల ముందు ఉప్పూ-నిప్పూలా ఉన్న కాంగ్రెస్-జేడీఎస్ పార్టీలు ఎన్నికల తర్వాత పొత్తుతో స్నేహపక్షాలుగా మారాయి. అయితే, తక్కువ సీట్లు గెలుచుకున్న జేడీఎస్ నుంచి కుమారస్వామి ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపడుతుండగా.. ఆయన నేతృత్వంలోని ప్రభుత్వంలో ఎక్కువ ఎమ్మెల్యే సీట్లు గెలుచుకున్న కాంగ్రెస్ పార్టీ భాగస్వామిగా కొనసాగనుంది.
జేడీఎస్ కన్నా కాంగ్రెస్ రెట్టింపు సీట్లు వచ్చినప్పటికీ.. ఎన్నికల తర్వాత నెలకొన్న అనివార్య పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ జేడీఎస్‌కు అండగా నిలిచి.. ప్రభుత్వ ఏర్పాటులో భాగస్వామిగా ఉండబోతున్న సంగతి తెలిసిందే. అయితే, జేడీఎస్-కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వ విషయంలో ముఖ్యమంత్రి పదవి కీలకం కాబోతోంది. ముఖ్యమంత్రి పదవీకాలాన్ని పంచుకునే ప్రసక్తే లేదని, ఐదేళ్లు తానే సీఎంగా కొనసాగుతానని కుమారస్వామి చెబుతుండగా.. సీఎం పదవిని చెరో రెండున్నరేళ్లు పంచుకోవాల్సిందేనని కాంగ్రెస్ పార్టీలో వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో జేడీఎస్-కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నాళ్లు కొనసాగుతుందనేది ఆసక్తికరంగా మారింది.
తాజాగా కర్ణాటక కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి డీకే శివకుమార్ సైతం ఈ విషయంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేయడం గమనార్హం. జేడీఎస్-కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా ఐదేళ్లు అధికారంలో ఉంటుందా? అని ప్రశ్నించగా.. అది కాలమే సమాధానం చెప్తుందని ఆయన తెలిపారు. ‘అదికాలమే సమాధానం చెప్తుంది. నేను ఇప్పుడు ఏమీ చెప్పలేను. మా ముందు పలు అంశాలు, ప్రత్యామ్నాయాలు ఉన్నాయి. కాబట్టి ఇప్పుడే నేనేమీ చెప్పలేను’అంటూ ఆయన సమాధానాన్ని దాటవేశారు. మరోవైపు ముఖ్యమంత్రి పదవి పంపకం అనేది జేడీఎస్-కాంగ్రెస్ పొత్తులో కీలకం కానుందని వినిపిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment