
న్యూఢిల్లీ : తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి గత మూడురోజులుగా ఢిల్లీలోనే మకాం వేశారు. పార్టీ పెద్దలతో ఆయన వరుసగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలో పార్టీ తీరుపై, నాయకుల తీరుపై ఆయన హైకమాండ్ పెద్దలతో చర్చిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఉత్తమ్ ఢిల్లీ పర్యటనపై టీపీసీసీలో ఉత్కంఠ కొనసాగుతోంది. దీంతో అసలు ఢిల్లీలో ఏం జరుగుతోందని రాష్ట్ర సీనియర్ నేతలు ఆరా తీస్తున్నారు.
ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో శుక్రవారం రాత్రి ఉత్తమ్ భేటీ అయి.. రాష్ట్ర రాజకీయ పరిస్థితులపై అరగంటపాటు చర్చించారు. బూత్ కమిటీలను ఏర్పాటు చేయాలని, ‘శక్తి’ ఆప్ రిజిస్ట్రేషన్ కార్యక్రమాన్ని యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని ఈ సందర్భంగా రాహుల్ ఆదేశించారు. ఇక, రాష్ట్రంలో పార్టీ నిర్మాణం, కమిటీల కూర్పుపై చర్చించేందుకు కాంగ్రెస్ తెలంగాణ వ్యవహారాల ఇన్‌చార్జ్ అశోక్ గెహ్లాట్‌తో ఉత్తమ్ నేడు (శనివారం) భేటీ కానున్నారు. తెలంగాణకు ముగ్గురు ఇన్‌చార్జ్ సెక్రటరీలు, మరో ఇన్‌చార్జ్ జాయింట్ సెక్రటరీని హైకమాండ్ నియమించనుంది. అలాగే పార్టీ పదవుల నియామకం విషయమై అధిష్టానం పెద్దలతో ఉత్తమ్ సీరియస్‌గా చర్చిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ నెలాఖరుకు ముందుగానే పార్టీలో అన్ని నియామకాలను పూర్తిచేసేందుకు అధిష్ఠానం కసరత్తు చేస్తోంది. పార్టీ పదవుల నియామకం విషయంలో అన్ని సామాజికవర్గాలకు సమప్రాధాన్యం ఇవ్వాలని, సీనియర్లను సముచితరీతిలో గౌరవించి.. సమతూకాన్ని పాటించాలని కాంగ్రెస్ హైకమాండ్ భావిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment