
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్‌లో కాంగ్రెస్ పార్టీ పనితీరుపై టీపీసీసీ ఆందోళన చెందుతోంది. రాష్ట్రంలోని పాత పది జిల్లాల్లో పార్టీ వరుస కార్యక్రమాలతో ఊపు తెచ్చేందుకు యత్నిస్తుండగా, కీలకమైన గ్రేటర్‌లో నెలకొన్న పరిస్థితిపై తర్జనభర్జన పడుతోంది. గ్రేటర్ పరిధిలో 15 అసెంబ్లీ నియోజకవర్గాలు, రెండు లోక్‌సభా స్థానాలున్నాయి. గత జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కేవలం ఒక్క డివిజన్‌లోనే విజయం సాధించింది. ఇది ఆ పార్టీ మనోస్థైర్యాన్ని తీవ్రంగా దెబ్బతీసింది. ఆ తర్వాత ఆ పార్టీ బలాబలాలు పెరిగినట్టుగా అధినాయకత్వానికి విశ్వాసం కలగడంలేదు. పార్టీకి ముఖ్య నేతలు గ్రేటర్‌లో చాలా మంది ఉన్నా, ఏ ఇద్దరూ కలసి చర్చించుకునే పరిస్థితి లేకపోవడం టీపీసీసీకి సంకటంగా మారింది.
గ్రేటర్ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి గతంలోనే రాజీనామా చేసినట్టుగా మాజీమంత్రి దానం నాగేందర్ ప్రకటించినా అది ఆమోదం పొందలేదు. మాజీ మంత్రులు మర్రి శశిధర్‌రెడ్డి, ఎం.ముఖేశ్ గౌడ్, మాజీ ఎంపీ ఎం.అంజన్‌కుమార్ యాదవ్ తదితర ముఖ్యనేతలు ఉన్నా పార్టీ బలోపేతం కోసం చేపడుతున్న కార్యక్రమాలేవీ కనిపించడం లేదని టీపీసీసీ అసంతృప్తిగా ఉంది. నియోజకవర్గాల ఇన్‌చార్జీల పనితీరుపై కూడా టీపీసీసీ పెదవి విరు స్తోంది. ఏఐసీసీ స్థాయి నేత వీహెచ్, రాజ్యసభ సభ్యుడు ఖాన్ వంటివారు కూడా పార్టీ విస్తరణ కోసం కృషి చేయడంలేదని టీపీసీసీ ముఖ్యులు అసంతృప్తిగా ఉన్నారు. దీంతో పార్టీ బలోపేతానికి అనుసరించే వ్యూహంపై టీపీసీసీ మల్లగుల్లాలు పడుతోంది.
ముందుగా నియోజకవర్గాల వారీగా పార్టీ పరిస్థితి, నేతల పనితీరుపై అధ్యయనం చేసి, బలోపేతానికి చర్యలు తీసుకోవడం మేలని నేతలు యోచిస్తున్నట్టు తెలుస్తోంది. నాయకుల పనితీరు, అంకితభావం, సమర్థతను బట్టి వచ్చే ఎన్నికల్లో వారికి ప్రాధాన్యత ఉండొచ్చని పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో అవకాశం వస్తుందనే విశ్వాసం కలిగినవారే పార్టీ బలో పేతానికి కృషి చేస్తారని టీపీసీసీ భావిస్తోంది. ఏఐసీసీ, టీపీసీసీ పునర్వ్యవస్థీకరణ తర్వాత గ్రేటర్ కాంగ్రెస్‌పై దృíష్టి కేంద్రీకరించాలని భావిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment