
సాక్షి, హైదరాబాద్: ప్రజల ఉసురుపోసుకుంటూ, అభివృద్ధిని అడ్డుకుంటూ కాంగ్రెస్ నేతలంతా కాలకేయ ముఠాలాగా వ్యవహరిస్తున్నారని ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ విమర్శించారు. ఎమ్మెల్సీ రాజు, ఎమ్మెల్యే గణేశ్ గుప్తాతో కలిసి శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రాన్ని పదేళ్లపాటు మిడతల దండులాగా దోచుకున్నారని ఆరోపించారు.
గాంధీ భవన్‌లో కూర్చుని పిచ్చికూతలతో హింసావాదాన్ని రెచ్చగొట్టాలని కాంగ్రెస్ నేతలు కుట్రలు చేసినా, టీఆర్‌ఎస్ పార్టీ అభివృద్ధిపైనే దృష్టి కేంద్రీకరించిదని చెప్పారు. ప్రజలకు వ్యతిరేకంగా పనిచేస్తున్న కాంగ్రెస్ దండుకు ప్రజలే బుద్ధి చెప్తారని ఎమ్మెల్సీ రాజు హెచ్చరించారు. మంత్రి కేటీఆర్ పనిచేసే తత్వాన్ని, సమర్థతను ఓర్వలేక కాంగ్రెస్ నాయకులు నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారని ఎమ్మెల్యే గణేశ్ గుప్తా విమర్శించారు.
కేటీఆర్ విజయాలను జీర్ణించుకోలేని కాంగ్రెస్
మండలిలో ప్రభుత్వ విప్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: సిరిసిల్ల నుంచి సిలికాన్ వ్యాలీ దాకా మంత్రి కేటీఆర్‌కు సర్వత్రా అభినందనలు వస్తున్నాయని, దీనిని జీర్ణించుకోలేక కాంగ్రెస్ నేతలు పిచ్చిపట్టినట్టుగా వ్యవహరిస్తున్నారని శాసనమండలిలో ప్రభుత్వ విప్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి విమర్శించారు.
శుక్రవారం విలేకరులతో మాట్లాడుతూ గతంలో కాంగ్రెస్ నేతలంతా ప్రజలను పట్టించుకోకుండా క్లబ్బుల్లో, ఏసీ గదుల్లో గడిపారని ఆరోపించారు. మంత్రి కేటీఆర్ ప్రజల్లో తిరుగుతూ సమస్యలను పరిష్కరించడమే కాకుండా విదేశాలను ఆకర్షించి పెట్టుబడులు తీసుకొస్తున్నాడని అన్నారు. అవినీతి పొరలు కమ్మిన కాంగ్రెస్ నాయకుల కళ్లకు ప్రతీ స్కీమ్‌లోనూ స్కామ్ కనబడుతోందని విమర్శించారు.
Comments
Please login to add a commentAdd a comment