మాట్లాడుతున్న రాజ్యసభ సభ్యుడు బండ్ల ప్రకాశ్
నారాయణపేట (మహబూబ్‌నగర్): ఎక్కడా లేనివిధంగా తెలంగాణలో అభివృద్ధి జరుగుతోంది.. దాన్ని చూసి ఓర్వలేక ప్రతిపక్షాలు గగ్గోలు పెడుతున్నాయి.. ప్రం ద్రాగస్టున సీఎం కేసీఆర్ నేతృత్వంలో శ్రీకారం చుట్టిన కంటి వెలుగు కార్యక్రమానికి వస్తే పరీక్షలు చేయించి కళ్లు తెరిపిస్తాం.. జరిగిన అభివృద్ధి చూయిస్తాం.. అని రాజ్యసభ సభ్యుడు బండ్ల ప్రకాశ్, పార్లమెంట్ సభ్యుడు జితేందర్‌రెడ్డి అన్నారు. ఆదివారం నారాయణపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గ ప్రమాణస్వీకారోత్సవంలో వారు ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడారు. నీళ్లు..నియామకాలు.. నిధుల పేరు తో 14 సంవత్సరాలు పోరాడి రాష్ట్రాన్ని సాధించుకున్నామని, కేసీఆర్ నేతృత్వంలో రాష్ట్రం నంబర్ వన్ స్థానానికి అడుగులు వేస్తున్నదన్నారు.
గత పాలకుల నిర్లక్ష్యంతో తెలంగాణ ప్రాంతం అన్ని విధాలుగా నష్ట పోయిందని విమర్శించారు. సాగునీటి ప్రాజెక్టుల ద్వారా ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో 18 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలనే లక్ష్యంతో పాలమూరు–రంగారెడ్డి సాగునీటి ప్రాజెక్టును నిర్మిస్తున్నామని, ఇప్పటికే జిల్లాలోని ప్రాజెక్టుల ద్వారా 7 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందన్నారు. 24 గంటల కరెంట్‌ను ఇచ్చిన ఘనత టీఆర్‌ఎస్ ప్రభుత్వానికి దక్కిందని, రైతులకు పెట్టుబడిసాయం కింద ఎకరాకు రూ.4 వేల చొప్పున ఇస్తూ ఏడాదికి ఖరీఫ్, రబీలో రూ.12 వేల కోట్ల బడ్జెట్‌ను కేటాయించామన్నారు. మత్స్యకారుకలకు ఉపాధి కల్పించేందుకు చెరువుల్లో చేపలు వదలడం, కురవలకు గొర్రెలు, యాదవులకు గేదేలు ఇస్తున్నామని తెలిపారు. 46 వేల చెరువులను పునరుద్ధరించాలనే లక్ష్యంతో మిషన్ కాకతీయ పథకానికి శ్రీకారం చుట్టి ఇప్పటికి 4 విడతల్లో 18 వేల చెరువులను పూర్తి చేసిందన్నారు.
పేటకు కాటన్‌మార్కెట్
నారాయణపేట వ్యవసాయ మార్కెట్ యార్డులో కాటన్ మార్కెట్‌ను ఏర్పాటు చేసేందుకు తమ వంతు కృషి చేస్తామని ఎంపీ జితేందర్‌రెడ్డి భరోసానిచ్చారు. తెలంగాణ రాష్ట్రం 17.20 శాతం ఆర్థికాభివృద్ధి సాధిస్తూ ప్రపంచపుటాల్లోకి ఎక్కిందన్నారు. నేడు రాష్ట్రంలోని 58 లక్షల మంది రైతులకు రైతుబంధు చెక్కులు ఇస్తూ రూ.5 లక్షల బీమా సౌకర్యం కల్పించిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కిందన్నారు. నాలుగు రోజుల్లో నారాయణపేటకు మిషన్‌భగీరథ నీళ్లు వస్తాయన్నారు. జెడ్పీ చైర్మన్ బండారి భాస్కర్, ఎమ్మెల్యే ఎస్.రాజేందర్‌రెడ్డి, మున్సిపల్ చైర్‌పర్సన్ గందె అనసూయ, టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు శివకుమార్, వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
రైతుకు బాసటగా నిలిచాం
దేవరకద్ర: రైతును అన్ని విధాలా ఆదుకుని వ్యవసాయాన్ని పండగ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం బాసటగా నిలిచిందని రాజ్యసభ సభ్యుడు బండ ప్రకాశ్ అన్నారు. ఆదివారం దేవరకద్ర మార్కెట్ కమిటీ పాలక వర్గం ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో ముఖ్య అథితిగా పాల్గొని ప్రసంగించారు. తెలంగాణ ప్రభుత్వం వచ్చాక వ్యవసాయానికి పెద్దపీట వేసిందని, సాగునీటి వనరులను పెంచడానికి కొత్త ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టి రైతుకు అండగా నిలిచిందన్నారు. పాలమూర్–రంగారెడ్డి ఎత్తిపోతల పథకంకు రూ.35 వేల కోట్లను కేటాయించి 8 లక్షల ఎకరాలను సాగులోకి తీసుకురావడానికి కృషి చేస్తోందన్నారు. కాకతీయుల కాలంలో తవ్విన చెరువులు, కుంటలకు గత రాష్ట్రంలోని 46 వేల చెరువులను, కుంటలను పునరుద్ధరించే పనులను చేపట్టిందన్నారు. గత 60 ఏళ్లలో రాష్ట్రంలో 4 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సరిపోయే గోదాములు ఉండగా నాలుగేళ్లలో 19 లక్షల మెట్రిక్ టన్నుల గోదాములు అందుబాటులోకి తెచ్చామన్నారు. 24 గంటల ఉచిత విద్యుత్ అందించడం బృహత్తర కార్యక్రమమన్నారు.
రిజర్వేషన్ల వల్లే..
ప్రభుత్వం అన్నివర్గాలకు అధికారం పంచాలనే ఉద్దేశ్యంలో మార్కెట్ యార్డుల్లో కూడా రిజర్వేషన్లు కల్పించి అందరికి అవకాశం కల్పించిందని ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి అన్నారు. దేవరకద్ర మార్కెట్ ఎస్సీలకు రిజర్వు చేయడం వల్ల ఒక దళితునికి చైర్మన్ అయ్యే అవకాశం వచ్చిందన్నారు. నూతన పాలక వర్గం రైతులకు అండగా ఉంటూ వారికి న్యాయం చేసే విధంగా చూడాలని కోరారు.
ప్రమాణ స్వీకారోత్సవం....
నారాయణపేట, దేవరకద్ర వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలక మండలి ప్రమాణ స్వీకారోత్సవం అట్టహాసంగా జరిగింది. నారాయణపేట మార్కెట్ కమిటీ చైర్మన్‌గా సరాఫ్ నాగరాజు, దేవరకద్ర చైర్మన్‌గా దొబ్బలి ఆంజనేయులు, వైస్ చైర్మన్‌గా డోకూర్ రాములు ప్రమాణస్వీకారం చేశారు. దేవరకద్రలో జరిగిన కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్ బండారి భాస్కర్, రాష్ట్ర స్పోర్ట్ అథారిటీ చైర్మన్ వెంకటేశ్వర్‌రెడ్డి, ఎంపీపీ ఇవీ.గోపాల్, చిన్నచింతకుంట ఎంపీపీ క్రాంతి, మాజీ మార్కెట్ చైర్మన్ జట్టి నర్సింహారెడ్డి, మండల టీఆర్‌ఎస్ అధ్యక్షుడు శ్రీకాంత్‌యాదవ్, హర్షవర్దన్‌రెడ్డి, నాయకులు కొండ శ్రీనివాస్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డి, కుర్వ శ్రీను, వెంకటేశ్, బాలస్వామి, నరేందర్‌రెడ్డి, శివరాజు, సత్యనారాయణ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment