సాక్షి, న్యూఢిల్లీ : రాబోయే రోజుల్లో ఏ జాతీయ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేదని, ప్రాంతీయ పార్టీల కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని టీఆర్‌ఎస్ ఎంపీ వినోద్ జోస్యం చెప్పారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వచ్చే 30ఏళ్ల వరకు మళ్లీ ఒక జాతీయ పార్టీ ప్రభుత్వాన్ని పరిపాలించలేదని చెప్పారు. 1985 నుంచి 2014 వరకు భారతదేశం ఒక సంకీర్ణ ప్రభుత్వాల యుగాన్ని చూసిందని, 2019లో ఖచ్చితంగా ప్రాంతీయ పార్టీలపై ఆధారపడే ప్రభుత్వం వస్తుందని స్పష్టం చేశారు.తెలంగాణలో పెండింగ్‌లో ఉన్న అంశాలపై వివిధ కేంద్ర మంత్రులను కలుస్తున్నట్లు తెలిపారు. సీతారామ ప్రాజెక్టు అనుమతి కోసం కేంద్రమంత్రి హర్షవర్ధన్‌ను కలిశామని చెప్పారు. హైకోర్టు విభజన ప్రక్రియ సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సాగుతోందని, జనవరి ఒకటి నుంచి కొత్త హైకోర్టు ఏర్పడనున్నట్లు సుప్రీంకోర్టు చెప్పిందన్నారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దేశానికి స్వాతంత్రం తెచ్చింది కూడా తానే అని చెప్పే రకమంటూ ఎద్దేవా చేశారు. మధ్యప్రదేశ్, రాజస్తాన్, చత్తీస్‌గఢ్ ఎన్నికల్లో చంద్రబాబు వల్లే కాంగ్రెస్ గెలిచిందని చెప్పుకోవటం విడ్డూరమన్నారు. ఏపీలో చంద్రబాబు అధికారంలోకి వస్తాడో.. రాడో అన్న మీమాంస ఉందని, ఆయనకు జాతీయ రాజకీయాల్లో పాత్ర ఉండే అవకాశం లేదని పేర్కొన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో 16 ఎంపీ స్థానాలు గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment