సాక్షి, న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా రాజకీయంగా ఇటీవల వినిపిస్తున్న అంశం జమిలి ఎన్నికలు. ఏకకాలంలో అసెంబ్లీ, లోక్‌సభకు ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. జమిలి ఎన్నికలపై మీ అభిప్రాయాన్ని వ్యక్తం చేసేందుకు ఈ నెల 7, 8వ తేదీల్లో ఢిల్లీలో జరిగే సమావేశానికి హాజరు కావల్సిందిగా దేశంలో ముఖ్య రాజకీయ పార్టీలను లా కమిషన్ ఆహ్వానించిన విషయం తెలిసిందే. జమిలి ఎన్నికలకు తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ఎస్) సంపూర్ణ మద్దతు ప్రకటించింది. ఈ మేరకు తెలంగాణ సీఎం కేసీఆర్ లా కమిషన్‌కు లేఖ రాశారు. లా కమిషన్ ఎదుట ఇదే అభిప్రాయాన్ని చెబుతామని టీఆర్‌ఎస్ ఎంపీ వినోద్ వెల్లడించారు. ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలనే ఆలోచనతో టీఆర్‌ఎస్ ఏకీభవిస్తున్నట్లు తెలిపారు. ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించడం వల్ల ప్రజాధనం ఆదా చేయవచ్చునని, అయితే ఇది ముందస్తు ఎన్నికలకు సంకేతం మాత్రం కాదని వివరించారు.
మరోవైపు ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ జమిలి ఎన్నికలకు తమ మద్దతు ఉంటుందని ఇటీవల ప్రకటించారు. బీజేపీ పాలిత మహారాష్ట్ర, హర్యానా శాసనసభల పదవీ కాలం 2019 చివర్లో ముగియనుంది. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా రెండు విడతలుగా అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలు నిర్వహించాలని బీజేపీ భావిస్తోంది. కొన్ని రాష్ట్రాల అసెంబ్లీలను ముందస్తుగా రద్దు చేయాలంటే రాజ్యాంగంలో కొన్ని మార్పులు చేసి సవరించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో నేటి మధ్యాహ్నం లా కమిషన్ సభ్యులతో సమావేశమే టీఆర్‌ఎస్ ఏకకాల ఎన్నికలకు (అసెంబ్లీ, లోక్‌సభ) సిద్ధమని ప్రకటించనున్నారు.
‘లోక్‌సభకు, అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు నాలుగు నుంచి ఆరు నెలల సమయం పడుతుంది. ఈ సమయమంతా జిల్లా రాష్ట్ర అధికార యంత్రాంగం అంతా ఎన్నికల ప్రక్రియలో బిజీగా ఉంటుంది. లోక్ సభ, అసెంబ్లీకి వేర్వేరుగా ఎన్నికలు జరగడం వల్ల విలువైన సమయం వృథా. సుదీర్ఘమైన ఎన్నికల నియమావళితో అభివృద్ధికి ఆటంకం ఏర్పడుతుంది. ఒకేసారి ఎన్నికలు నిర్వహించకపోవడం వల్ల రాజకీయ పార్టీలు, అభ్యర్థులు భారీగా ధనాన్ని ఖర్చు చేయాల్సి వస్తుంది. జమిలి ఎన్నికలకు మా పార్టీ మద్దతు ఇస్తుందని’ లా కమిషన్‌కు కేసీఆర్ రాసిన లేఖలో పేర్కొన్నారు.
జమిలి ఎన్నికలపై చర్చ ఇప్పటిది కాదు : వినోద్
దేశ వ్యాప్తంగా ఒకేసారి పార్లమెంటు, అసెంబ్లీ ఎన్నికలపై మా అధినేత, సిఎం కేసీఆర్ లేఖ ను లా కమిషన్ కు అందించా. ఒకేసారి ఎన్నికలకు మేం మద్దతు తెలుపుతున్నాం. జమిలి ఎన్నికలపై చర్చ ఇప్పటిది కాదు. తొలిసారి 1983లోనే దేశ వ్యాప్తంగా ఎన్నికలపై చర్చ మొదలైంది. నరేంద్ర మోదీ ప్రభుత్వమో, లేక బీజేపీనో ఈ చర్చను ప్రారంభించలేదు. రాష్ట్రాల అభివృద్ధి, దేశ అభివృద్ధినే లక్ష్యంగా మా అధినేత దేశ వ్యాప్తంగా ఎన్నికలకు మద్దతు తెలుపుతున్నారు. కేంద్రంలో ప్రభుత్వం ఏర్పడగానే, రాష్ట్రాల్లో జరిగే ఎన్నికలపైనే దృష్టి ఉంటుంది. మోదీ అధికారంలోకి వచ్చాక కూడా ప్రతి సంవత్సరం ఏదో ఒక రాష్ట్రంలో ఎన్నికలు వస్తూనే ఉన్నాయి. దీంతో చాలా ధనం, సమయం వృధా అవుతుంది. 2019 లోనే తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్నాయి కాబట్టి ఒకేసారి ఎన్నికలతో నష్టం ఉండదు. అయినా మిగతా రాష్ట్రాల కు జరుగుతున్న నష్టాన్ని దృష్టి లో పెట్టుకొని మా అభిప్రాయాలను తెలిపాం. ముందుస్తు ఎన్నికలపై చర్చ అని కొందరు అర్థం లేని వాదనకు తెరలేపారు. కేవలం ఒకేసారి దేశ వ్యాప్తంగా పార్లమెంటు, అసెంబ్లీ ఎన్నికలపైనే చర్చ జరుగుతుందని ఎంపీ వినోద్ వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment