
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఎన్నికల ప్రచారంలో టీఆర్‌ఎస్ దూసుకెళ్తోంది. మిగిలిన పార్టీలు ఇంకా అభ్యర్థుల జాబితాను సిద్ధం చేసే పనిలో ఉంటే.. టీఆర్‌ఎస్ మాత్రం నెలరోజుల క్రితమే అభ్యర్థులను ప్రకటించి ప్రచారంలో ఓ మెట్టు పైనే ఉన్నా మంటోంది. శనివారం కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం.. ఎన్నికలకు మరో రెండు నెలల సమయం ఉండటం.. అధికార పార్టీ అభ్యర్థులను కలవరపెడుతోంది.
ప్రచారానికి తగినంత సమయం ఉండటం సంగతి పక్కనబెడితే.. అప్పటివరకు ప్రచారం కోసం చేయాల్సిన ఖర్చుపై లెక్కలేసుకుని అభ్యర్థులు బేజారవుతున్నారు. ఎన్నికల విషయంలో గతంలో ఎప్పుడూ లేని పరిస్థితి ఇప్పుడు ఎదురవుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నవంబర్ రెండోవారంలో ఎన్నికలు ఉండొచ్చన్న ఉద్దేశంతో టీఆర్‌ఎస్ ముందుగానే అభ్యర్థులను ప్రకటించింది. మరో నెల జాప్యం సమస్యగా మారింది.
సెప్టెంబర్ 6న మొదలై..
ముందస్తుకు సై అన్న కేసీఆర్.. సెప్టెంబరు 6న ఒకేసారి 105 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. మరుసటిరోజే హుస్నాబాద్‌లో ప్రచారంతో తనే రంగంలోకి దిగారు. అధినేత ఆదేశాల మేరకు అభ్యర్థులు సైతం అదే రోజు తమ తమ నియోజకవర్గాల్లో ప్రచారం మొదలుపెట్టారు. అయితే.. కొన్ని సెగ్మెంట్లలో మాత్రం అభ్యర్థులను మార్చుతారని ప్రచారం జరిగింది. దీంతో పలువురు అభ్యర్థులు ప్రచారం ప్రారంభించే విషయంలో డోలాయమానంలో పడ్డారు.
ఈ విషయంపై టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ మరింత స్పష్టతనిస్తూ.. అభ్యర్థుల జాబితాలో మార్పు ఉండదని వెల్లడించారు. ఒక్క స్థానంలోనూ పార్టీ అభ్యర్థిని మార్చబోమని, అందరూ ప్రచారహోరు పెంచాలని ఆదేశించారు. అనంతరం రేగిన అసమ్మతి జ్వాలను ఆర్పేందుకు మంత్రి కేటీఆర్ రంగంలోకి దిగారు. అసంతృప్తి నేతలతో రోజువారీ చర్చలు జరుపుతూ.. వారిని బుజ్జగిస్తున్నారు. ఈ ప్రక్రియ కూడా దాదాపుగా పూర్తయినట్లే. మొత్తంగా సెప్టెంబరు రెండోవారం నుంచి అభ్యర్థులు ప్రచారం ప్రారంభించారు.
మోపెడవుతున్న ఖర్చులు
గత ఎన్నికల్లా కాకుండా.. ప్రతి ఊరు, ప్రతి వీధి తిరిగితేగానీ ఓటర్లను ప్రసన్నం చేసుకోలేని పరిస్థితి నెలకొంది. దీనిపైనే అభ్యర్థి ఎక్కువగా ఖర్చుపెట్టాల్సి ఉంటుంది. మామూలుగా అయితే.. అభ్యర్థుల ప్రకటన తర్వాత ఎన్నికల వరకు 20–25రోజుల గడువు మాత్రమే ఉండేది. కానీ ముందస్తుగా అసెంబ్లీని రద్దు చేయడం.. వెంటనే ఎన్నికలకు వెళ్దామనుకున్నప్పటికీ.. డిసెంబర్ 7న ఎన్నికలకు ఈసీ షెడ్యూల్ విడుదల చేయడం రాజకీయాలను వేడెక్కించాయి.
దీంతో ఇంకా రెండు నెలలు అంటే దాదాపుగా 60 రోజుల పాటు ప్రచారం చేయాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. టీఆర్‌ఎస్ మినహా ఏ పార్టీ అభ్యర్థులను ప్రకటించకపోవడంతో.. అందరి కంటే ముందే ప్రచారాన్ని ప్రారంభించి ఎక్కువరోజులు కొనసాగించక తప్పని పరిస్థితి అధికార పార్టీ అభ్యర్థులకు ఎదురవుతోంది. రోజువారీ కార్యక్రమాల నిర్వహణ, ద్వితీయశ్రేణి నేతలు, ముఖ్య కార్యకర్తలు పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనేలా చేయడం.. ఇదంతా భారీ ఖర్చుతో కూడిన వ్యవహారమే. ఇదే అభ్యర్థుల ఎన్నికల ఖర్చు తడిసి మోపెడయ్యేందుకు కారణమవుతోంది. అభ్యర్థులను ముందే ప్రకటించడంతోనే టీఆర్‌ఎస్‌కు ఈ పరిస్థితి తప్పడంలేదు.
ప్రజల్లోకి వెళ్లేందుకు అవకాశం
ప్రచారగడువు ఎక్కువగా ఉండడం వల్ల వీలైనంత మంది ఎక్కువ ఓటర్లను వ్యక్తిగతంగా కలుసుకునేందుకు వీలవుతుందని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. ‘ఓటర్లను ప్రత్యక్షంగా కలిసినప్పుడు టీఆర్‌ఎస్, అభ్యర్థుల విషయంలో సదభిప్రాయం వ్యక్తమవుతోంది. గతంలో నామినేషన్ల చివరిరోజు వరకు అభ్యర్థులను ఖరారు చేసే పరిస్థితి ఉండేది. అంత తక్కువ సమయంలో అన్ని గ్రామాల్లో ప్రచారం చేసేందుకు వీలుండేది కాదు.
ఇప్పుడు ప్రతి గ్రామానికి, ప్రతి వీధికి వెళ్తున్నాం. ప్రతి ఓటరునూ కలిసే అవకాశం వచ్చింది. వివిధ కారణాల వల్ల పార్టీ శ్రేణులకు కొన్ని గ్రామాలతో అంతరం ఏర్పడింది. ఈ సమస్యలను పరిష్కరించుకునేందుకు ఇప్పుడు సమయం దొరికింది’అని ఓ తాజా మాజీ ఎమ్మెల్యే అభిప్రాయపడ్డారు. గడువు పెరగడంతో టీఆర్‌ఎస్ ప్రచార సారథి కేసీఆర్‌తో బహిరంగసభలు నిర్వహించే వెసులుబాటు కలిగిందని ఆయన పేర్కొన్నారు. గత ఎన్నికల్లోలాగే తమకు కలిసొస్తుందని పలువురు టీఆర్‌ఎస్ అభ్యర్థులు భావిస్తున్నారు. అటు, టీఆర్‌ఎస్ అధిష్టానం కూడా ఈ రెండు నెలల గడువును సద్వినియోగం చేసుకునేందుకు వ్యూహాలు రచిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment