సాక్షి, హైదరాబాద్ : ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో ఇచ్చిన హామీలనే కార్మికులు ఇవాళ అడుగుతున్నారని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. కార్మికుల డిమాండ్లు న్యాయబద్ధమైనవని, అందుకే ప్రతిపక్షాలు మద్దతు ఇస్తున్నాయని చెప్పారు. గాంధీ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘బస్సు రూట్లను ప్రైవేటీకరణ చేయడం అంటే అమ్మడం అన్నట్లే. ఆర్టీసీ ఒకరోజుతో నిర్మించింది కాదు.. దశాబ్దాల ఆస్తులు. ఆర్టీసీపై ఏ నిర్ణయమైనా చట్ట సభల్లో చర్చలు జరిపి తీస్కోవాలి. ఆర్టీసీ ప్రజలకు సేవ చేసేందుకు ఏర్పాటు చేసిన సంస్థ. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వల్ల ఆర్టీసీ నష్టాల్లోకి వెళ్ళింది’ అన్నారు.
అవకాశాన్ని కేసీఆర్ దుర్వినియోగం చేస్తున్నారు
‘రాష్ట్రంలో అతిపెద్ద కార్పొరేషన్ ఆర్టీసీ. 6 ఏళ్లలో దివాలా తీయించి ప్రైవేట్ పరం చేస్తున్నారు. కార్మికుల మరణాలకు ప్రతిపక్షాలు కారణం కాదు. ప్రభుత్వమే కారణం. కేసీఆర్ కేపిటలిస్టు, ఫ్యూడలిస్ట్ భావాలతో ఉన్నారు. తెలంగాణ సమాజం ఇప్పటికైనా మేల్కోవాలి. ఇవాళ ఆర్టీసీ, రేపు సింగరేణితో పాటు ఆస్తులన్నీ అమ్మకానికి పెట్టినా ఆశ్చర్యం లేదు. తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ సొంత ఎస్టేట్ కాదు. మంచి పాలన ఇవ్వాలని కేసీఆర్‌కి ప్రజలు అధికారం ఇచ్చారు. ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని కేసీఆర్ దుర్వినియోగం చేస్తున్నారు. ప్రజల ఆస్తులు..ప్రజల రూట్లు ప్రైవేటికరణ చేసేందుకు కేసీఆర్ ఎవరు? ఇప్పటికైనా కార్మికులను ప్రభుత్వం చర్చలకు పిలవాలి’అని డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment