వృద్ధుడి ప్రసంగాన్ని అడ్డుకున్న రాజన్ గోహేన్(ఎడమ వైపు)
దిస్‌పూర్: కేంద్ర మంత్రి రాజన్ గోహేన్ వ్యవహారశైలి వివాదాస్పదంగా మారింది. ఓ కార్యక్రమంలో వృద్ధుడితో దురుసుగా వ్యవహరించిన వీడియో ఒకటి వైరల్ అవుతోంది. స్థానిక సమస్యలపై సదరు వ్యక్తి మాట్లాడుతున్న సమయంలో.. మంత్రి అతన్ని ప్రసంగించకుండా అడ్డుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో చక్కర్లు కొడుతోంది. మంగళవారం నాగోన్ పట్టణంలో ఈ ఘటన చోటు చేసుకుంది.
నాగోన్ మున్సిపాలిటీ ఆధ్వర్యంలో స్వచ్ఛ భారత్ అభియాన్ తరపున ఓ కార్యక్రమం నిర్వహించారు. దీనికి కేంద్ర మంత్రి రాజన్ గోహేన్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. కార్యక్రమంలో పాల్గొన్న ఓ రిటైర్డ్ టీచర్ మైక్ అందుకుని అమెలాపట్టి ప్రాంతంలో రోడ్ల పరిస్థితి అస్సలు బాగోలేదని, ఎమ్మెల్యే ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని మాట్లాడసాగారు. వెంటనే తన కుర్చీల్లోంచి లేచిన రాజన్.. మైక్ ముందు చెయ్యి అడ్డం పెట్టి సదరు వృద్ధుడ్ని అడ్డుకున్నారు. ‘నాన్ సెన్స్. ఏం మాట్లాడుతున్నావ్. ఈ విషయంపై సంబంధిత అధికారితో మాట్లాడాలేగానీ, ఇక్కడ మాట్లాడటం ఏంటి? కార్యక్రమాన్ని చెడగొట్టడానికి వచ్చావా? అంటూ ప్రశ్నించారు. దానికి ప్రతిగా ఆ రిటైర్డ్ టీచర్‘నేను నాగోన్‌లో నివసించే ఓ వ్యక్తిగా మాట్లాడుతున్నా. కావాలంటే నాతో రా... సమస్యలు ఎలా ఉన్నాయో చూపిస్తా. నేనేం అబద్ధాలు చెప్పటం లేదు’ అని ఆయన మంత్రికి అదే స్థాయిలో బదులిచ్చారు.
వెంటనే మంత్రి ‘సమస్య ఏదైనా ఉంటే నన్ను వ్యక్తిగతంగా కలవాలి. అంతేగానీ ఇలా పబ్లిక్ మీటింగ్‌లో లేవనెత్తటం ఏంటి? బుద్ధుందా నీకు. ఇలా మాట్లాడినంత మాత్రాన సమస్యలు పరిష్కారం అవుతాయనుకుంటున్నావా? మూసుకుని కూర్చో’ అంటూ గోహేన్ ఆ వృద్ధుడిపై అరిచారు. దీంతో ఆ వ్యక్తి వెళ్లి వెనుక వరుసలో కూర్చుండి పోయారు. కార్యక్రమం తర్వాత గోహేన్‌ను మీడియా ఈ వ్యవహారంపై ప్రశ్నించింది. ఆ వ్యక్తికి క్షమాపణలు చెప్పదల్చుకున్నారా? అని అడగ్గా.. దానికి ఆయన నేనెందుకు చెప్పాలి అంటూ గోహేన్ బదులిచ్చారు. ఈ ఘటనపై కొందరు విద్యార్థులు నాగోన్‌లోని మంత్రి ఇంటి ఎదుట ధర్నా చేపట్టారు. సదరు రిటైర్డ్ టీచర్‌కు గోహేన్ క్షమాపణలు చెప్పే వరకు ఆందోళన విరమించమని విద్యార్థులు తేల్చి చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment