
సాక్షి, అనంతపురం : అనంతపురం జిల్లాను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కరివేపాకులా వాడుకుంటున్నారని మాజీ ఎంపీ అనంతవెంకట్రామిరెడ్డి మండిపడ్డారు. రేపు (గురువారం) ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనంతపురం పర్యటన సందర్భంగా మాజీ ఎంపీ, వైఎస్‌ఆర్ సీపీ నేత అనంత వెంకట్రామిరెడ్డి బుధవారం ఇక్కడ మీడియాతో మాట్లాడారు. గత నాలుగేళ్లుగా కరవు ప్రాంతమైన అనంతపురం జిల్లాకు చంద్రబాబు అనేక హామీలు ఇచ్చారని.. వాటిలో ఏ ఒక్కటీ నెరవేర్చలేదని విమర్శించారు.
అనంతపురం టీడీపీ నేతలకు చీము నెత్తురు, సిగ్గూశరం ఉంటే చంద్రబాబు ను నిలదీయాలని డిమాండ్ చేశారు. ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి వ్యాఖ్యలపై స్పందించిన అనంత వెంకట్రామిరెడ్డి పదవులను కరివేపాకులా చూస్తున్న వారంతా రాజీనామా చేస్తే బాగుంటుందన్నారు. అక్రమ సంపాదన, దౌర్జన్యాలను పక్కనపెట్టి సమస్యలు తీర్చేందుకు ప్రయత్నిస్తే ఫలితం ఉంటుందని అన్నారు. ఏపీ సర్కార్ ఆర్భాటంగా నిర్వహిస్తున్న జన్మభూమి కార్యక్రమం ఓ బోగస్ అని, అర్జీలు తీసుకోవడం మినహా సాధించింది శూన్యమని ఆయన వ్యాఖ్యానించారు. జన్మభూమి టీడీపీ ప్రచార కార్యక్రమంలా సాగుతోందని, ఏపీలో అధికారులు నరకయాతన అనుభవిస్తున్నారని అనంత వెంకట్రామిరెడ్డి అన్నారు. హెరిటేజ్ కంపెనీకి లబ్ది చేకూర్చేందుకే చంద్రబాబు పాడి పరిశ్రమను నీరుగారుస్తున్నారన్నారు.