సాక్షి, న్యూఢిల్లీ: మహా కూటమి సీట్ల పంచాయితీ హస్తినకు చేరింది. జంట నగరాలు, చుట్టూ ఉన్న 35 అసెంబ్లీ స్థానాలే పొత్తుల్లో పీటముడికి కారణమని కాంగ్రెస్ కోర్ కమిటీకి పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి బుధవారం నివేదించినట్టు తెలిసింది. ఈ స్థానాల్లో తమకే ఎక్కువ బలముందని టీడీపీ, టీజేఎస్‌లు చెబుతున్నాయని.. అయితే, అక్కడ మన పార్టీ కూడా బలంగానే ఉందని కోర్ కమిటీ సభ్యులైన ఏకే ఆంటోనీ, గులాంనబీ ఆజాద్‌లకు ఉత్తమ్ వెల్లడించారు. అక్కడ తమకూ బలం ఉందని.. అలాంటప్పుడు వదులుకోకూడదని.. ఆయన సూచించినట్లు సమాచారం. కేవలం ఈ కారణంతోనే పొత్తులు ఇంకా కొలిక్కిరాలేదని.. కోర్‌కమిటీకి ఉత్తమ్ నివేదించినట్లు తెలిసింది. పార్టీ తెలంగాణ వ్యవహారాల ఇంచార్జి ఆర్సీ కుంతియాతో కలిసి కమిటీతో భేటీ అయ్యారు. ఈ అంశాలపైనే సుదీర్ఘంగా చర్చ జరిగింది.
టీడీపీ, టీజేఎస్ పట్టు
పలు స్థానాలను మూడు పార్టీలు తమకే కావాలని పట్టుపట్టడం, కొన్ని చోట్ల రెండు పార్టీల మధ్య ఏకాభి ప్రాయం కుదరకపోవడం కారణంగా.. పొత్తులపై చిక్కుముడి వీడటం లేదని నివేదించినట్టు తెలుస్తోంది. ఆంధ్ర ప్రజలు ఎక్కువగా ఉన్న స్థానాల్లో టీడీపీ, ఉద్యోగులు, ఉద్యమాలు బలంగా సాగిన నియోజకవర్గాల్లో టీజేఎస్ పోటీ చేయాలని భావి స్తుండటం, ఆయా స్థానాల్లో తమకూ బలం ఉండటంతో ఎటూ తేల్చలేకే.. టీపీసీసీ చివరకు కోర్ కమిటీకి నివేదించినట్టు తెలుస్తోంది. టీఆర్‌ఎస్ నుంచి పలువురు సీనియర్ నేతల చేరిక అంశంపై కూడా చర్చించినట్టు సమాచారం. రాహుల్ పర్యటనలో అక్కడ టీఆర్‌ఎస్‌కు చెందిన పలువురు నేతలు కాంగ్రెస్‌లో చేరనున్నట్టు తెలుస్తోంది. కాగా, కూటమిలో సీట్ల సర్దుబాటు అంశం త్వరలోనే ఓ కొలిక్కి వస్తుందని కుంతియా తెలిపారు. కోర్ కమిటీ సభ్యులతో భేటీ అనంతరం కుంతియా మీడియాతో మాట్లాడారు. కూటమిలోని పార్టీలతో చర్చలు ఆశాజనకంగా ఉన్నాయని, సీట్ల సర్దుబాటు త్వరలోనే కొలిక్కి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
టీఆర్‌ఎస్ ఓ ప్రైవేటు సంస్థ!
‘టీఆర్‌ఎస్ ఒక ప్రైవేటు సంస్థ. కేసీఆర్, ఆయన కుమారుడు, కుమార్తె, అల్లుడు నిర్ణయం తీసుకుంటే సరిపోతుంది’ అని కుంతియా ఎద్దేవా చేశారు. ఆ పార్టీకి ఏ కమిటీల మీదా ఆధారపడాల్సిన అవసరం ఉండదని.. అక్కడ ప్రజాస్వామిక విధానమనే మాటకు తావే లేదని విమర్శించారు. తమను తాము టీఆర్‌ఎస్‌తో పోల్చుకోదలచుకోవడం లేదన్నారు. ‘కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల జాబితా త్వరలోనే ఖరారవుతుంది. కొన్ని స్థానాల్లో ఇద్దరు, ముగ్గురు కాంగ్రెస్ నేతలు బలంగా ఉన్నప్పటికీ.. టికెట్లు దక్కని వారికి ఎమ్మెల్సీ, రాజ్యసభ సభ్యత్వాలు, నామినేటెడ్ పోస్టుల్లో నియామకం ద్వారా న్యాయం చేస్తాం’అని కుంతియా వెల్లడించారు.
35 స్థానాలపై ‘కూటమి’ పీటముడి!
Published Thu, Oct 18 2018 1:53 AM | Last Updated on Thu, Sep 19 2019 8:44 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment