
కొండగట్టు ప్రమాద స్థలాన్ని పరిశీలిస్తున్న ఉత్తమ్. చిత్రంలో జీవన్‌రెడ్డి, పొన్నం తదితరులు
కొండగట్టు (చొప్పదండి): జగిత్యాల జిల్లా కొండగట్టు బస్సు ప్రమాద స్థలాన్ని, బాధిత కుటుంబాలను పరామర్శించేందుకు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు తీరిక లేకపోవడం బాధాకరమని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి వ్యాఖ్యానించారు. మానవత్వంలేని ఇలాంటి ముఖ్యమంత్రి ఉండటం మన దౌర్భాగ్యమని పేర్కొన్నారు. గురువారం తాజా మాజీ ఎమ్మెల్యే టి.జీవన్ రెడ్డి, మాజీ ఎంపీలు పొన్నం ప్రభాకర్, మధుయాష్కీ తదితరులతో కలసి ఆయన ప్రమాద ఘటన స్థలాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబాలను ఓదార్చారు.
అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. దేశంలోనే అతిపెద్ద బస్సు ప్రమాద ఘటన జరిగితే కేసీఆర్‌లో చలనం లేకపోవడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రభుత్వం డొక్కు బస్సులను తిప్పుతూ ప్రజల ప్రాణాలు హరిస్తోందని మండిపడ్డారు. మృతుల కుటుంబాలకు ఇంటికో ఉద్యోగం ఇవ్వాలని ఉత్తమ్ డిమాండ్ చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఒకరికి చొప్పున ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని, తక్షణ సహాయం కింద రూ.25 వేలు అందిస్తామని ఆయన హామీ ఇచ్చారు. టి.జీవన్‌రెడ్డి మాట్లాడుతూ రూ.15 లక్షల పరిహారం ఇప్పించేందుకు పోరాటం చేస్తామని తెలిపారు. ఈ ఘటనపై ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ ముందుగా స్పందించారని గుర్తుచేశారు. బాధితులకు ప్రభుత్వం తరఫున వైద్యం అందిస్తామని కేసీఆర్ చెప్పిన మాటలు అమలు కావడంలేదని పొన్నం ప్రభాకర్ ఆరోపించారు.
Comments
Please login to add a commentAdd a comment