సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌పై కాంగ్రెస్ సీనియర్ నేత, ఏఐసీసీ కార్యదర్శి వీ.హనుమంతారావు మండిపడ్డారు. ఏబీసీ అంటే ఏంటో తెలుసా అంటూ రాహుల్‌గాంధీపై ట్విటర్లో విమర్శలు చేసిన కేటీఆర్.. నిజాలు మాట్లాడడం లేదని విమర్శించారు. ‘బోఫోర్స్ స్కాం అన్నావ్.. కానీ అదే బోఫోర్స్ ఫిరంగులతో కార్గిల్ యుద్దం గెలిచిన సంగతి మరచిపోవద్ద’ని కేటీఆర్‌ను హెచ్చరించారు. బోఫోర్స్ కుంభకోణం గురించి మాట్లాడుతున్న కేటీఆర్ బీజేపీ హయాంలో చోటుచేసుకున్న రాఫెల్ స్కాం గురించి ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు. తెలంగాణలో రాహుల్ పర్యటన గ్రాండ్ సక్సెస్ అయిందని ఆనందం వ్యక్తం చేశారు. రాహుల్ పర్యటనను అడ్డుకునేందుకు సీఎం కేసీఆర్ చాలా ప్రయత్నాలు చేశాడని అన్నారు. పార్టీ కార్యాలయంలో ఆయన బుధవారం మీడియాతో మాట్లాడారు.
సంపత్, కోమటిరెడ్డి కేసులో స్పీకర్ మధుసూదనాచారికి హైకోర్టు నోటీసులు ఇవ్వడం కేసీఆర్ సర్కార్‌కు సిగ్గుచేటని అన్నారు. గొర్రెలు, బర్రెలు అంటూ కేసీఆర్ బీసీలను మోసం చేస్తున్నాడని అన్నారు. బీసీలపై కేసీఆర్‌కు చిత్తశుద్ధి ఉంటే బీసీ రిజర్వేషన్లను 69 శాతానికి పెంచి రాజ్యాంగంలోని 9 షెడ్యూల్‌లో పెట్టించాలని సవాల్ విసిరారు. బీసీ క్రిమిలేయర్‌ను ఎత్తేస్తామని పార్టీ మేనిఫెస్టోలో చెప్పాలని అన్నారు. క్రిమిలేయర్‌ను ఎత్తేసే విషయం తమ నేత రాహుల్‌కు చెబితే సానుకూలంగా స్పందించారన్నారు.
Comments
Please login to add a commentAdd a comment