సాక్షి, అమరావతి: శాసనసభలో తనను ప్రత్యేక సభ్యుడిగా గుర్తించి, సీటు కేటాయించాలని గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మంగళవారం అసెంబ్లీలో స్పీకర్ తమ్మినేని సీతారాంకు విజ్ఞప్తి చేశారు. దీనికి స్పీకర్ సానుకూలంగా స్పందించారు. సీటు కేటాయింపు విషయాన్ని త్వరలోనే తెలియజేస్తామని చెప్పారు. స్పీకర్ ప్రశ్నోత్తరాల కార్యక్రమాన్ని చేపడుతున్న సమయంలో.. తనకు మాట్లాడే అవకాశం ఇవ్వాలని వంశీ కోరారు. తన నియోజకవర్గం అభివృద్ధి పనుల కోసం ముఖ్యమంత్రిని కలిశానని, దీన్ని టీడీపీ నేతలు తప్పుబట్టారని, ఎందుకు కలిశావని చంద్రబాబు నిలదీశారని, సామాజిక మాధ్యమాల్లో తన వ్యక్తిగత ప్రతిష్టను దిగజార్చేలా పోస్టింగ్‌లు పెట్టారని వంశీ సభకు తెలిపారు.
తనను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్టు టీడీపీ తీసుకున్న నిర్ణయం మీడియా ద్వారా తెలిసిందన్నారు. పోలవరం కుడి కాల్వ కింద 1,200 ఎకరాల్లో నీళ్లివ్వడానికి మోటార్లు తాను పెట్టినా గత ప్రభుత్వం కరెంట్ ఇవ్వలేదని, అప్పటి ప్రభుత్వ వైఖరిని సీఎం దృష్టికి తీసుకెళ్లానని, పేదల ఇళ్లపట్టాల గురించి ముఖ్యమంత్రిని అడిగానని తెలిపారు. ఆయన సానుకూలంగా స్పందించారని చెప్పారు. తాను టీడీపీ సభ్యుడినైనా సభలో మాట్లాడకుండా ఆ పార్టీ వారే అడ్డుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వర్షాల వల్ల ఇసుక కొరత ఏర్పడిందని, ప్రభుత్వానికి కొంత సమయం ఇవ్వాలని చెప్పినా రుచించలేదన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో వారితో కలసి ముందుకెళ్లడం కష్టమని, తనను ప్రత్యేక సభ్యుడిగా గుర్తించి హక్కులు కాపాడాలని స్పీకర్‌ను కోరారు.
సభ నుంచి బయటకువెళ్లిన టీడీపీ
వంశీ మాట్లాడేందుకు ఉపక్రమించిన సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబు అడ్డుపడటంతో.. స్పీకర్ తమ్మినేని సీతారాం జోక్యం చేసుకుని, వంశీ ప్రజలు ఎన్నుకున్న సభ్యుడని, మాట్లాడే అవకాశం ఇవ్వాలని తెలిపారు. స్పీకర్ నిర్ణయంతో ఏకీభవించని విపక్ష సభ్యులు ఒక్కసారిగా లేచి గందరగోళం సృష్టించే ప్రయత్నం చేశారు. ఈ సమయంలో సభా వ్యవహారాల మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ మాట్లాడుతూ, 360 నిబంధన కింద ఎవరినైనా మాట్లాడనిచ్చే అవకాశం సభాపతికి ఉందని రూల్ పొజిషన్ వివరించారు. ఈ దశలో చంద్రబాబుతో సహా టీడీపీ సభ్యులు ఆగ్రహంతో సభ నుంచి బయటకు వెళ్లిపోయారు. ఈ సమయంలో ఓ టీడీపీ సభ్యుడు అసెంబ్లీనుద్దేశించి చేసిన వ్యాఖ్యలపై స్పీకర్ ఘాటుగా స్పందించారు. ‘పవిత్రమైన అసెంబ్లీని వైఎస్సార్‌సీపీ కార్యాలయం అంటారా? ఈ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలి’ అన్నారు. అనంతరం వంశీ వినతిపై.. ఆ ఎమ్మెల్యే కోరిన సీటు ఇంకొకరికి కేటాయించడం వల్ల వేరే సీటు ఇచ్చే ప్రయత్నం చేస్తామని చెప్పారు.
ఆ పాపం ఫలితమే 15 ఏళ్లు దూరం: స్పీకర్
ఎన్టీ రామారావుకు గతంలో శాసనసభలో మాట్లాడే అవకాశం కూడా ఇవ్వని పాపంలో తాను భాగస్వామినేనని, ఆ పాపం ఫలితంగానే 15 ఏళ్లు అధికారానికి దూరంగా ఉండాల్సి వచ్చిందని స్పీకర్ తమ్మినేని సీతారాం అన్నారు. స్పీకర్, శాసనసభను ఉద్దేశించి టీడీపీ సభ్యులు చేసిన అవమానకర వ్యాఖ్యలపై స్పీకర్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. చాలా సందర్భాల్లో శాసనసభ ఎలా నడిచిందనే చరిత్ర ప్రజల మనçస్సులో ఉందని స్పీకర్ అన్నారు. శాసనసభలానా.. పార్టీ కార్యాలయంలా వ్యవహరించారా అనే గడచిన చరిత్ర ప్రజలకు తెలుసునన్నారు. ప్రతిపక్ష నాయకులు ‘సభ మీ జాగీరా?’ అనడం మంచిది కాదన్నారు. ఇది ఎవరి జాగీరూ కాదని, ప్రజలదని స్పష్టం చేశారు. తాను పార్టీలకు అతీతంగా పనిచేస్తానని, అందరికీ మాట్లాడే అవకాశం ఇస్తానని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment