
సాక్షి, న్యూఢిల్లీ: పార్లమెంట్ సమావేశాల్లో భాగంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి కీలక బిల్లును ప్రవేశపెట్టారు. చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ.. రాజ్యసభలో ప్రైవేటు మెంబర్ బిల్లును ప్రవేశపెట్టారు. సభలో దీనిపై చర్చ ప్రారంభించిన ఆయన.. జనాభా నిష్పత్తి ప్రకారం బీసీలకు అసెంబ్లీ, పార్లమెంట్‌లో రిజర్వేషన్లు కల్పించాలని కోరారు. ఎస్పీ, ఎస్టీ తరహాలోనే వెనుకబడిన వర్గాలైన బీసీలకు కూడా సమాన హక్కులను కల్పించాలన్నారు.
అదే విధంగా బీసీలపై జరుగుతున్న అత్యాచారాలను నిరోధించడానికి ప్రత్యేక చట్టాన్ని రూపొందించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. కేంద్ర ప్రభుత్వంలో ప్రత్యేక బీసీ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని కోరారు. స్కిల్ డెవలెప్‌మెంట్ శాఖ కింద ఉన్న నిధులను వృత్తిపరమైన కులాలకు అందజేయాలని తన ప్రసంగంలో పేర్కొన్నారు. కాగా విజయసాయి రెడ్డి ప్రవేశపెట్టిన ఈ బిల్లుకు టీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీలు మద్దతు ప్రకటించాయి.
కాగా అంతకుముందు సభలో ప్రసంగించిన విజయసాయి రెడ్డి మరో మూడు ప్రైవేటు బిల్లును సభలో ప్రవేశపెట్టారు. నేర శిక్షాస్మృతి సవరణ బిల్లు 2018, జనన మరణ రిజిస్ట్రేషన్ల సవరణ బిల్లు 2018, ది అన్ ఫైర్ టర్మ్స ఇన్ కాంట్రాక్ట్ బిల్లు 2018లను సభలో ప్రవేశపెట్టారు. రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్ రాయ్ అనుమతితో ఆయన సభలో సంబంధిత బిల్లులపై ప్రసంగించారు.
Comments
Please login to add a commentAdd a comment