సాక్షి, అమరావతి: ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడుపై వైఎస్సార్‌సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్‌లో శాసన మండలి రద్దు నేపథ్యంలో చంద్రబాబు అనుకూల మీడియా ప్రదర్శిస్తున్న ద్వంద్వ విధానాలపై ఆయన నిప్పులు చెరిగారు. 'ఎన్టీఆర్ మండలిని రద్దు చేసిన విషయాన్ని ఎల్లో మీడియా, బాబు గ్యాంగ్ ప్రస్తావించడం లేదు. వైఎస్సార్ పునరుద్ధరించడాన్ని పదేపదే చెబుతున్నారు. చంద్రబాబు 1985, 2005లో రెండు సందర్భాల్లో మండలి ఏర్పాటును వ్యతిరేకిస్తూ ఉపన్యాసం దంచాడు. మీ రెండు నాల్కల ధోరణి వీడియోల సాక్షిగా బయటపడిందిప్పుడు' అంటూ విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు. (పచ్చ పత్రికలు జ్ఞానాన్ని వెదజల్లుతున్నాయి)
కాగా మరో ట్వీట్‌లో.. ఏపీ రాజధానిగా విశాఖపట్నం అంశంలో చంద్రబాబు తీరును విమర్శించారు. 'జీవనోపాధి లేక ఉత్తరాంధ్ర ప్రజలు వలసలు వెళుతుంటే, వాళ్లపై నిప్పులు పోసుకుంటున్నారెందుకు చంద్రబాబు..? ఈనాడు, చంద్రజ్యోతిలతో జీఎన్ రావు కమిటీని వక్రీకరించే రాతలు రాయించారని ధ్వజమెత్తారు. ఒక్క విశాఖకు మాత్రమే కాదు ముంబయి, చెన్నై నగరాలకు కూడా తుపాను తాకిడి ఉందని విజయసాయి రెడ్డి తెలిపారు. విశాఖ ఏదో అగ్నిపర్వతం అంచున ఉన్నట్టు చిత్రీకరిస్తున్నారని' ఆయన మండిపడ్డారు.
మరో ట్వీట్‌లో.. 'భోగాపురం ఎయిర్‌పోర్ట్ ప్రకటనకు ముందే ఇన్‌సైడర్ ట్రేడింగులో చంద్రబాబు బినామీలు చుట్టుపక్కల భూములను చుట్టేశారు. దానిపైనా విచారణ జరిగితే నీతిచంద్రికల బండారం బయట పడుతుంది. విశాఖలో నిబంధనలకు విరుద్ధంగా ఇచ్చిన అనుమతులు, కోస్టల్ రెగ్యులేషన్ల అతిక్రమణలు, మీరు చేయని అక్రమాలు లేవంటూ' విజయసాయిరెడ్డి మండిపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment