
సాక్షి, విజయవాడ : అవినీతి రాజకీయాలు మానాలని ప్రజలు బుద్ధిచెప్పినా చంద్రబాబుకు జ్ఞానోదయం కాలేదని దేవాదాయ శాఖామంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ధ్వజమెత్తారు. ఐదేళ్ళ పాలనలో అరచేతిలో వైకుంఠం చూపించిన బాబు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేస్తున్న అభివృద్ధి చూసి ఓర్వలేకపోతున్నారన్నారు. సోమవారం విజయవాడ 33వ డివిజన్‌లో ఇంటింటికీ పర్యటించిన మంత్రి ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సమస్యలను వెంటనే పరిష్కరించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. సీఎం జగన్ ఆదేశాలతో మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రజా సమస్యలపై దృష్టి పెట్టారని తెలిపారు.
అలాగే అర్హులైన పేదలందరికీ ఉచితంగా ఇళ్లు మంజూరు చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. విజయవాడ సిటీని మోడల్ సిటీగా తీర్చిదిద్దేందుకు వైఎస్ జగన్ కృత నిశ్చయంతో ఉన్నారన్నారు. గత టీడీపీ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి వల్ల నగరంలో డ్రైనేజీ, రోడ్డు మార్గాలు అస్తవ్యస్తంగా మారాయని.. రోజుల వ్యవధిలోనే పరిస్థితిని చక్కదిద్దుతామని పేర్కొన్నారు. వార్డు వాలంటీర్ల ద్వారా రేషన్, ఫించన్లు, ఇళ్ల పట్టాలు వంటి పథకాలు సక్రమంగా అమలు చేస్తున్నామని తెలిపారు. నీతిలేని రాజకీయాలు చేసే చంద్రబాబుకు రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమం మింగుడు పడటం లేదని విమర్శించారు. ప్రజల్లో సీఎం జగన్‌కు పెరుగుతున్న జనాదరణ చూసి ఓర్వలేక బురద రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment