విలాస్‌రావ్ దేశ్‌ముఖ్, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి (ఫైల్)
సాక్షి, భైంసా(ముథోల్): ఏ ఎన్నికలు వచ్చినా కుభీర్ మండలంలోని పల్సి గ్రామస్తులకు మహారాష్ట్ర మాజీ సీఎం, కేంద్ర మాజీ మంత్రి దివంగత నేత విలాస్‌రావ్ దేశ్‌ముఖ్ గుర్తుకొస్తారు. ఎందుకంటే, ఆయన సతీమణి వైశాలి పుట్టి పెరిగింది ఈ గ్రామంలోనే! ఈమె ఆదిలాబాద్ జిల్లా పరిషత్ మొట్టమొదటి చైర్మన్ పల్సికర్ రంగారావు కూతురు. దీంతో ఎన్నికలు వచ్చిన ప్రతీసారి మా ఊరి అల్లుడే మహారాష్ట్ర సీఎంగా, కేంద్ర మంత్రిగా పని చేశారని ఇక్కడి వారు గర్వంగా చెప్పుకుంటారు.
ఆయన పిళ్లుబాయి అల్లుడు..
పల్సికర్ రంగారావుకు ఇద్దరు భార్యలు మొదటి భార్య పుష్పకు ఒక కుమార్తె కాగా, రెండో భార్య పిళ్లుబాయికి ముగ్గురు కూతుళ్లు, ఒక కుమారుడు. పిళ్లుబాయి మొదటి కూతురు వైశాలిని విలాస్‌రావ్ దేశ్‌ముఖ్‌తో వివాహం జరిపించారు. వైశాలి–విలాస్‌రావ్ దంపతుల కొడుకు రితేష్ దేఖ్‌ముఖ్. బాలీవుడ్ హీరోగా రాణిస్తున్న రితేష్ తెలుగు సినిమా ప్రియులకు సుపరిచితమైన హీరోయిన్ జెనీలియాను వివాహం చేసుకున్నాడు. ఆదిలాబాద్ జిల్లా పరిషత్ మొదటి చైర్మన్‌గా పని చేసిన రంగారావుకు ఊరిపేరే ఇంటి పేరుగా మారింది. అప్పట్లో ఈ ప్రాంతమంతా మహారాష్ట్రలో ఉండేది. పెద్ద భూస్వామి అయిన రంగారావును మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లావాసులు రంగారావు పల్సికర్ అని పిలుస్తుండేవారు. భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడ్డాక ముథోల్ ప్రాంతాన్ని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కలిపేశారు. రంగారావు అనారోగ్యంతో మృతి చెందినప్పుడు ఆయన అంత్యక్రియలు ఇక్కడే స్వగ్రామంలో చేశారు. నాడు సీఎంగా ఉన్న విలాస్‌రావ్ దేశ్‌ముఖ్ తన మామ పెద్ద కర్మ నిర్వహించిన 12వ రోజు పల్సికి వచ్చారు. రంగారావు మరణానంతరం ఈ ప్రాంత ప్రజల్లో ఆయన పేరు చిరకాలం ఉండిపోయేలా అప్పటి ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్సార్ భైంసా మండలంలోని వాడి గ్రామం దగ్గర సుద్దవాగుపై నిర్మించే మినీ ప్రాజెక్టుకు పల్సికర్ రంగారావు ప్రాజెక్టుగా నామకరణం చేశారు.
పెళ్లిళ్లకు ప్రత్యేక ఆహ్వానం..
విలాస్‌రావ్ దేశ్‌ముఖ్ ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా పల్సి గ్రామ ప్రజలకు, మాజీ మంత్రి దివంగత గడ్డెన్న కుటుంబీకులకు, మాజీ ఎమ్మెల్యే బోస్లే నారాయణరావు పటేల్ కుటుంబీకులకు, డీసీసీ అధ్యక్షుడు పవార్ రామారావు పటేల్ కుటుంబీకులకు ఆహ్వాన పత్రికలు వచ్చేవి. ఫిబ్రవరి–3, 2012న బాలీవుడ్ హీరో రితేశ్ దేశ్‌ముఖ్, హీరోయిన్ జెనీలియాల వివాహానికి కూడా పల్సి వాసులు ముంబయి సైతం వెళ్లారు. విలాస్‌రావ్ దేశ్‌ముఖ్ భార్య వైశాలి పెరిగిన ఇళ్లు ఇప్పటికీ పల్సిలో ఉంది. రంగారావు కుటుంబీకులంతా మహారాష్ట్రకు వెళ్లిపోయినా ఇంటిని మాత్రం భద్రంగా ఉంచుతున్నారు. గత ఏడాది మరమ్మతులు కూడా చేశారు. చుట్టూ గోడను రాతి బండతో నిర్మించారు. లోపల పెద్ద కోటను పోలిన కట్టడాలున్నాయి. కోట లోపల పచ్చని చెట్లను పెంచారు. రెండో అంతస్తును కట్టెతో అందంగా చెక్కారు.
విలాస్‌రావ్ రాజకీయ ప్రస్థానం..
1974లో బాబుల్‌గాం సర్పంచ్‌గా మొదలైన విలాస్‌రావ్ దేశ్‌ముఖ్ రాజకీయ ప్రస్థానంలో ఎన్నో పదవులు ఆయనను వరించాయి. 1976లో లాథూర్ తాలుకా పంచాయతీ సమితి అధ్యక్షుడిగా, జిల్లా పరిషత్ డిప్యూటీ చైర్మన్‌గా పనిచేశారు. 1980, 85, 90ల్లో ఎమ్మెల్యేగా ఎన్నికై రెవెన్యూ, కోఆపరేటివ్, అగ్రికల్చరర్, హోం, ఇండస్ట్రీ, ఎడ్యుకేషన్ మంత్రిగా, రెండుసార్లు మహారాష్ట్ర సీఎంగా పనిచేశారు. 2004లో మహారాష్ట్ర సీఎంగా రెండోసారి ఎన్నికైన ఆయన 2008 నవంబర్ 26న ముంబాయి పేలుళ్లకు బాధ్యత వహిస్తూ తన పదవికి రాజీనామా చేశారు. అనంతరం రాజ్యసభకు ఎన్నికై డిసెంబర్ 2011లో కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిగా పనిచేశారు. అనారోగ్యంతో 14 ఆగష్టు 2012న విలాస్‌రావ్ దేశ్‌ముఖ్ మృతిచెందారు.
Comments
Please login to add a commentAdd a comment