సాక్షి, న్యూఢిల్లీ: విశాఖ నార్త్ నియోజకవర్గం నుంచి ఈ ఎన్నికల్లో పోటీ చేసిన మంత్రి గంటా శ్రీనివాసరావుకు ఓటమి తప్పదని బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు జోస్యం చెప్పారు. గంటా 25 ఏళ్ల రాజకీయ జీవితానికి నియోజకవర్గ ప్రజలు స్వస్తి చెప్పనున్నారని అన్నారు. సోమవారం విష్ణుకుమార్ రాజు మీడియాతో మాట్లాడుతూ.. ఈ స్థానంలో బీజేపీ తరఫున పోటీ చేసిన తాను, లేక వైఎస్సార్ సీపీ అభ్యర్థి విజయం సాధిస్తారని, మంత్రి గంటా మాత్రం గెలిచే అవకాశం లేదన్నారు. ఏపీలో బీజేపీకి లోక్‌సభ సీట్లు గెలిచే అవకాశం లేదన్నారు. మూడు అసెంబ్లీ సీట్లలో గట్టిపోటీ ఇచ్చామని చెప్పారు.
ఏపీలో ఎవరు గెలిచే అవకాశం ఉందని మీడియా ప్రశ్నించగా.. ఈ ఎన్నికల్లో టీడీపీ, వైఎస్సార్ సీపీ కోట్లాది రూపాయాల డబ్బు ఖర్చు చేశాయని, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేలా ప్రజల్ని ప్రలోభాలకు గురి చేశాయని విమర్శించారు. కేంద్రంలో ఇక నుంచి నరేంద్ర మోదీ వ్యతిరేక ఆటల సాగవని అన్నారు. ఎవరి సహాయ సహకారాలు లేకుండానే బీజేపీ 280 సీట్లు గెలుచుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. ఎన్డీయే కూటమితో కలిపితే ఎవరూ ఊహించని ఫలితాలు రానున్నాయన్నారు.
బీజేపీ వ్యతిరేక పార్టీలను ఏకం చేసే ప్రయత్నాలన్నీ వృధా అవుతాయని అన్నారు. బీజేపీకి పార్లమెంట్ సీట్లు ఎక్కువ వస్తున్నాయని చాలామంది బాధపడేవారు ఎక్కువయ్యారని విష్ణుకుమార్ రాజు వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీకి వచ్చి అందరినీ కూడగట్టే ప్రయత్నం చేయడం రెండు రోజుల ముచ్చటలా ఉందని ఎద్దేవా చేశారు. పశ్చిమ బెంగాల్‌లో కూడా బీజేపీకి 20 సీట్లు వస్తాయని అన్నారు. తమ దగ్గర ఉన్న పక్కా సమాచారంతోనే చెబుతున్నామని విష్ణుకుమార్ రాజు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment