
సాక్షి, న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా 18 రాష్ట్రాలు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 91 నియోజకవర్గాల్లో లోక్‌సభ ఎన్నికల తొలివిడత పోలింగ్ గురువారం ఉదయం ఏడు గంటలకు ప్రారంభమైంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఉత్తర్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, పశ్చిమబెంగాల్, అసోం, బిహార్, ఒడిశా,చండీగఢ్, జమ్ము కశ్మీర్, మహారాష్ట్ర, మణిపూర్, మేఘాలయా, మిజోరం, నాగాలాండ్, అరుణాచల్‌ప్రదేశ్, త్రిపుర, అండమాన్ నికోబార్, లక్షద్వీప్‌ల్లోని పలు నియోజకవర్గాల్లో తొలి విడత పోలింగ్ జరుగుతోంది.
ఇక జనరల్ నియోజకవర్గాల్లో పోలింగ్ ఉదయం ఏడు గంటలకు ప్రారంభమై సాయంత్రం 6 గంటలకు ముగుస్తుందని, ఈశాన్య రాష్ట్రాల్లో ఉదయం ఏడు గంటలకు ప్రారంభమయ్యే పోలింగ్ ఐదు గంటల వరకూ కొనసాగుతుందని ఈసీ ప్రకటించింది. అయితే మణిపూర్, నాగాలండ్‌లో సాయంత్రం 4 గంటల వరకే పోలింగ్ ముగుస్తుందని పేర్కొంది. మరోవైపు తొలివిడత పోలింగ్ జరిగే నియోజకవర్గాల్లో ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు.