సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి(పాత చిత్రం)
ఢిల్లీ: దేశంలో జరుగుతోన్న ఆర్ధిక పరిణామాలు, త్వరలో జరగబోయే సార్వత్రిక ఎన్నికలపై చర్చించామని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి తెలిపారు. ఢిల్లీలో రెండు రోజుల పాటు జరిగిన సీపీఐ జాతీయ కార్యవర్గ సమావేశాలకు సురవరం హాజరయ్యారు. ఈ సందర్భంగా సురవరం విలేకరులతో మాట్లాడుతూ.. బీజేపీని అధికారం నుంచి తొలగించి సెక్యులర్ ప్రభుత్వం ఏర్పాటు చేయాలని సీపీఐ నిర్ణయించిందని వెల్లడించారు. దేశంలో శాంతిభద్రతలను కాపాడటంలో బీజేపీ ప్రభుత్వం పూర్తిగా విఫలం అయిందన్నారు.
అన్ని పథకాలు, సంస్కరణలు ధనికులకు మాత్రమే లాభం చేకూరేలా ఈ ఐదేళ్లు బీజేపీ పాలించిందని విమర్శించారు. బీజేపీపై ప్రజలు ఆగ్రహంతో, అసంతృప్తితో ఉన్నారని వ్యాక్యానించారు. ఎక్కడ చూసినా రైతులు, విద్యార్థులు, ఉద్యోగులు అందరూ ధర్నాలు చేస్తున్నారని, ఇదంతా ప్రభుత్వంపై వ్యతిరేకతతోనే చేస్తున్నారని విమర్శించారు. పాకిస్తాన్‌లోని ఉగ్రస్థావరాలపై వైమానిక దాడులకు మద్ధతు ప్రకటిస్తున్నట్లు చెప్పారు. సైనికుల త్యాగాలను, వారి రక్తాన్ని బీజేపీ రాజకీయంగా మార్చడాన్ని సీపీఐ ఖండిస్తోందన్నారు. ఇప్పుడిప్పుడే రాఫెల్‌లో కొత్త అంశాలు బయటపడుతున్నాయని చెప్పారు.
పార్లమెంటుకు రంగం సిద్ధం
వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నామని వివరించారు. తెలంగాణాలో భువనగిరి, ఖమ్మం నుంచి, ఆంధ్రాలో విజయవాడ, అనంతపురం నియోజకవర్గాల నుంచి పోటీ చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. అలాగే జనసేన పార్టీతో ఏపీలో పొత్తు పెట్టుకోవాలని చూస్తున్నట్లు వివరించారు. 24 రాష్ట్రాల్లో మాత్రమే పోటీ చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. మొదట విడతలో భాగంగా 15 మంది ఎంపీ అభ్యర్థుల పేర్లను ప్రకటించినట్లు చెప్పారు. 11 మందితో కూడిన మ్యానిఫెస్టో కమిటీని ఏర్పాటు చేశామని, ఈ కమిటీకి డి.రాజా కన్వీనర్‌గా కొనసాగుతారని వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment