
ఢిల్లీ: అసెంబ్లీ అభ్యర్థుల జాబితా పూర్తిస్థాయిలో ఖరారైందని, మిగిలిన 19 స్థానాలకు రేపు ప్రకటన ఉంటుందని ఏఐసీసీ కార్యదర్శి బోస్ రాజు తెలిపారు. ఢిల్లీలో బోస్ రాజు విలేకరులతో మాట్లాడుతూ..సందిగ్ధత ఉన్న 4 స్థానాల్లో ఆశావహులతో రాహుల్ గాంధీ చర్చించారని తెలిపారు. టీజేఎస్ అధినేత కోదండరాంతో సమావేశం కూడా చాలా ఫలప్రదంగా జరిగిందని తెలిపారు. చర్చలన్నీ కొలిక్కి వచ్చాయని, అసంతృప్తులు ప్రతీ రాజకీయ పార్టీలో ఉంటారని వ్యాక్యానించారు. ఇదేమీ కొత్త విషయం కాదన్నారు.
ఎక్కడ డిమాండ్ ఎక్కువగా ఉంటే అక్కడ ఇటువంటి సమస్యలే ఉంటాయని పేర్కొన్నారు. బీసీలకు టీఆర్‌ఎస్ కంటే తామే ఎక్కువ స్థానాలు కేటాయించామని వెల్లడించారు. స్థానాలు దక్కని వారికి పార్టీ తగిన ప్రాధాన్యత కల్పిస్తుందని హామీ ఇచ్చారు. ప్రజా వ్యతిరేక టీఆర్‌ఎస్‌ను ఓడించడమే మహా కూటమి లక్ష్యమని స్పష్టం చేశారు. ఈ నెల 22న సోనియా గాంధీ సభకు సంబంధించి ఏర్పాట్లపై కర్ణాటక భవన్‌లో భేటీ అయి చర్చించామని తెలిపారు.
జనగామ సీటుపై డైలమా
జనగామ సీటు ఏ పార్టీకి దక్కుతుందోనని పెద్ద డైలమా ఏర్పడింది. జనగామ సీటు కావాలంటే కోదండరాంతో మాట్లాడుకోవాలని మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్యకు కాంగ్రెస్ అదిష్టానం సూచించినట్లు తెలిసింది. ఈ సీటుపై నిర్ణయం కాంగ్రెస్ కోదండరాం, పొన్నాలకే వదిలేసింది. ఢిల్లీలో నిన్న అర్ధరాత్రి పొన్నాల, కోదండరాం భేటీ తర్వాత పరిణామాలు మారిపోయినట్లుగా తెలుస్తోంది. ఈ సీటు ఎవరికి దక్కుతుందో తెలియాలంటే రేపటి వరకు వేచి చూడాల్సిందే.