
లక్నో: రానున్న లోక్‌సభ ఎన్నికల్లో కీలకంగా మారిన ఉత్తరప్రదేశ్‌లో ఒంటరిగా పోటీచేసేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధమైంది. ఎస్పీ, బీఎస్పీ కూటమి ప్రకటన అనంతరం ఒంటరి పోరుకు సిద్ధమైంది. రాష్ట్రంలోని మొత్తం 80 స్థానాల్లో పోటీ చేస్తున్నట్లు ఆ పార్టీ సీనియర్ నేత గులాంనబీ ఆజాద్ వెల్లడించారు. ఆదివారం లక్నోలోని పార్టీ కార్యాలయంలో రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు రాజ్ బబ్బర్‌తో సమావేశమైన ఆజాద్ పార్టీ ముఖ్య నేతలతో చర్చించారు. అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. అన్ని స్థానాల్లో ఒంటరిగా పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు. బీజేపీని ఓడించేందుకు అవసరమైతే తమతో కలిసివచ్చే పార్టీలను కలుపుకుని పోతామని ఆజాద్ పేర్కొన్నారు.
లోక్‌సభ ఎన్నికలకు సమయం ముంచుకొస్తున్న తరుణంలో అఖిలేష్, మాయావతిలు శనివారం కూటమిపై ప్రకటన చేసిన విషయం తెలిసిందే. ఎస్పీ, బీఎస్పీలు చెరో 38 స్థానాల్లో పోటీ చేస్తాయని వారు వెల్లడించారు. ఈ నేపథ్యంలో పార్టీ శ్రేణులను సమాయత్తం పరచడానికి కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు రాహుల్ గాంధీతో ఫిబ్రవరిలో 15 ప్రచార ర్యాలీలను నిర్వహించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఎంతో కీలకమైన యూపీలో బలం పెంచుకునేందుకు హస్తం నేతలు సర్వశక్తులొడ్డుతున్నారు. కాగా రాహుల్, సోనియా ప్రాతినిథ్యం వహిస్తున్న అమేథి, రాయబరేలి స్థానాలలో తాము అభ్యర్థిని నిలపమని ఎస్పీ, బీస్పీ ప్రకటించిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment