
ఇండోర్: అసోంలో దాదాపు 40 లక్షలమంది అక్రమ వలసదారులు ఉన్నారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా గతంలో పలుసార్లు చెప్పారని, ఆ 40 లక్షలమంది అక్రమ వలసదారులు ఎక్కడ ఉన్నారో చెప్పాలని కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ డిమాండ్ చేశారు. ఇటీవల అసోంలో జాతీయ పౌర జాబితా (ఎన్నార్సీ)ని ప్రకటించిన సంగతి తెలిసిందే.
రాష్ట్రంలో మొత్తం 19 లక్షలమందికి భారతీయ పౌరసత్వానికి సంబంధించిన సరైన పత్రాలు లేవని ఎన్నార్సీ తేల్చింది. ఈ నేపథ్యంలో కేంద్రంలోని బీజేపీ సర్కారు తీరుపై దిగ్విజయ్ ధ్వజమెత్తారు. ప్రజలను తప్పుదోవ పట్టించేలా బీజేపీ ప్రచారం చేస్తోందని, అసోంలోని 40 లక్షలమంది అక్రమ వలసదారులు ఎక్కడున్నారో అమిత్ షా లేదా ఆయన నంబర్ టు కైలాశ్ విజయ్‌వార్గియా చెప్పాలని డిమాండ్ చేశారు. మతం పేరిట రాజకీయాలు చేస్తూ దేశంలో సందేహాలు రేకెత్తించడం బీజేపీకి పాత అలవాటేనని దిగ్విజయ్ ఎద్దేవా చేశారు.