సాక్షి, అమరావతి: బీసీలకు 1/3 వంతు నామినేటెడ్ పోస్టులు ఇస్తామని చెప్పిన చంద్రబాబు.. అధికారంలోకి వచ్చాక ఆ విషయాన్ని పూర్తిగా విస్మరించారని వైఎస్సార్ సీపీ బీసీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జంగా కృష్ణమూర్తి విమర్శించారు. శుక్రవారం విజయవాడలోని ఐవీ ప్యాలెస్‌లో విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గ బీసీ కులాల అధ్యయన కమిటీ సమావేశం జరిగింది. సమావేశం అనంతరం జంగా విలేకరులతో మాట్లాడుతూ... టీడీపీ ప్రభుత్వ పాలనలో అన్ని వర్గాల ప్రజలూ బాధలు పడుతున్నారన్నారు. ముఖ్యంగా బీసీలను టీడీపీ వాడుకుని వదిలేసిందని విమర్శించారు. చంద్రబాబు సర్కారు విద్యా విధానాన్ని సర్వనాశనం చేసిందన్నారు. సంక్షేమ హాస్టళ్లను మూసివేసిందని ధ్వజమెత్తారు.
వైఎస్సార్ ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం ద్వారా పేద విద్యార్థులకు ఉచితంగా ఉన్నత చదువులు అభ్యసించే అవకాశం కల్పించారని, చంద్రబాబు సర్కారు ఈ పథకానికి తూట్లు పొడుస్తోందని ధ్వజమెత్తారు. నిరుద్యోగులకు రూ.2 వేల నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి, ఇప్పుడు నాలుగున్నరేళ్ల తర్వాత కేవలం లక్షన్నర మందికి రూ.వెయ్యి ఇస్తున్నారన్నారు. బీసీల్లో సంచార జాతులు దీనావస్థలో ఉన్నాయని, వారికి కనీస సౌకర్యాలు కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. అధ్యయన కమిటీ దృష్టికి వచ్చిన సమస్యలపై పూర్తి స్థాయిలో అధ్యయనం చేసిన తరువాత తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి నివేదిక అందజేస్తామని తెలిపారు.
మాజీ మంత్రి, అధ్యయన కమిటీ సభ్యులు నర్సేగౌడ్ మాట్లాడుతూ.. వైఎస్ జగన్ హామీ ప్రకారం ప్రతి కులానికి కార్పొరేషన్ ఏర్పాటు చేసి పేదవారికి సాయం చేస్తామని చెప్పారు. రిటైర్డ్ జడ్జి కృష్ణప్ప మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో బీసీలను మోసం చేసేందుకు చంద్రబాబు బీసీ అధ్యయన కమిటీ వేసినట్లు ఆరోపించారు. వైఎస్పార్ సీపీ బీసీ అధ్యయన కమిటీ సభ్యులు అవ్వారు ముసలయ్య మాట్లాడుతూ.. పార్టీలతో సంబంధం లేకుండా బీసీ కులాల వారు అధ్యయన కమిటీ వద్దకు వచ్చి సమస్యలు చెబుతున్నారన్నారు. వాటిపై అధ్యయనం చేసి నివేదిక ఇస్తామన్నారు. సమావేశంలో పార్టీ నేతలు మల్లాది విష్ణు, వెల్లంపల్లి శ్రీనివాస్, వసంత కృష్ణప్రసాద్, సామినేని ఉదయభాను, జోగి రమేష్, రక్షణ నిధి, మహమ్మద్ ఇక్బాల్, చిమటా సాంబు, బొమ్మన శ్రీనివాస్, కర్నాటి ప్రభాకర్, దుర్గారావుగౌడ్, విజిత, మహబూబ్, మీసాల రంగన్న పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment