సాక్షి, న్యూఢిల్లీ : దాదాపు 25 ఏళ్లుగా కమ్యునిస్టుల కంచుకోటగా పేరున్న త్రిపురలో పాగా వేసి కమలనాథులు గద్దెనెక్కబోతున్న తరుణంలో ఇప్పుడు అక్కడ ఎవరు ముఖ్యమంత్రిగా వస్తారు అనే అంశంపై చర్చనీయాంశంగా మారింది. పార్టీ కనుసన్నల్లో ఉంటున్న కొంతమంది అభ్యర్థులు తమను తామే ముఖ్యమంత్రిగా ఊహించుకుంటూ మురిసిపోతున్నారు. దాదాపు త్రిపురలో బీజేపీకి పూర్తి మెజార్టీ ఖాయమైపోయిన నేపథ్యంలో ఇక సీఎం అభ్యర్థిపై చర్చ జోరుగా ఊపందుకుంది.
సీఎం అభ్యర్థులుగా వినిపిస్తున్న పేర్లు ఇవే..
బిప్‌లాబ్ కుమార్ దేబ్
సీఎం పోస్టుకు బిప్‌లాబ్ పేరు ముఖ్యంగా వినిపిస్తోంది. ఈయన రాష్ట్ర బీజేపీ పార్టీ చీఫ్‌గా పనిచేస్తున్నారు. అంతేకాకుండా చాలా కాలం నుంచి ఆరెస్సెస్‌కు అనుబంధంగా ఉన్నారు. త్రిపురలోని గోమతి జిల్లాలోగల అక్రాబన్ అనే గ్రామంలో జన్మించిన ఆయన పదిహేనేళ్లపాటు ఢిల్లీలోనే ఉన్నారు. ఆ సమయంలో ఆయన జిమ్ ట్రైనర్‌గా పనిచేశారు. తొలిసారి 2016లో పూర్తిస్థాయిలో త్రిపుర పార్టీ పగ్గాలు అందుకున్నారు. ఆయనకు కేంద్ర నాయకత్వం దీవెనలు కూడా మెండుగా ఉన్నాయి. పైగా ఈయన ముందు నుంచి కూడా బీజేపీతోనే ఉన్న వ్యక్తి కావడంతో సీఎం అభ్యర్థిగా ఈయనే సరైనవాడు అనుకుంటున్నారట. అయితే, పార్టీ ఎన్నికల ప్రచార సమయంలో ఓ గిరిజన వ్యక్తిని ముఖ్యమంత్రి చేస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో తుది నిర్ణయం వచ్చే వరకు ఎదురుచూడాల్సిందే.
రామ్‌పద జమాతియా
ఇక ముఖ్యమంత్రి రేసులో రెండో వరుసలో వినిపిస్తున్న పేరు రామ్‌పద జమాతియా. ఈయన రాష్ట్ర బీజేపీకి ఉపాధ్యక్షుడిగా పనిచేస్తున్నారు. విశ్వహిందూ పరిషత్‌లో సభ్యుడిగా చేరి రెండేళ్లుగా పనిచేస్తున్నారు. జమాతియా గిరిజన తెగకు చెందిన ఈయన ఆ తెగకు కోశాధికారిగా కూడా పనిచేస్తున్నారు. ఒక వేళ ముందు చెప్పినట్లు బీజేపీ గిరిజనుడిని సీఎం చేయాలనుకుంటే ఈయనకే ఆ అవకాశం దక్కుతుంది.
డాక్టర్ అతుల్ దెబ్బార్మా
త్రిపుర ముఖ్యమంత్రి అభ్యర్థిగా మూడోస్థానంలో డాక్టర్ అతుల్ దెబ్బార్మా పేరు వినిపిస్తోంది. ఈయన సంస్కృతంలో స్కాలర్, పైగా వేదశాస్త్రాలపై పూర్తి పట్టున్నవారు. నాగ్‌పూర్‌లో ఉన్నప్పుడు వైద్యుడిగా కూడా పనిచేసి అనంతరం ఆరెస్సెస్ పంపించడంతో రాష్ట్రానికి వచ్చి పార్టీలో పనిచేశారు. గిరిజన అభ్యర్థిని బీజేపీ పెడితే ఈయన రెండో వరుసలో ఉన్నారు.
ఎవ్వరూ ఊహించని వ్యక్తినా..?
ముందు నుంచి కూడా ప్రధాని నరేంద్రమోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా ద్వయం తీసుకుంటున్న నిర్ణయాలు ఎవరి ఊహకు అందనట్లు ఉంటున్నాయి. వాస్తవానికి ప్రచారంలో ఉన్న వ్యక్తులెవరికీ కూడా వారు ఇప్పటి వరకు సీఎం బాధ్యతలు గానీ, పార్టీ అధ్యక్షుల బాధ్యతలుగానీ అప్పగించలేదు. మరో ఏడాదిలో జరగబోయే సాధారణ ఎన్నికలను, ఓటు బ్యాంకును దృష్టిలో పెట్టుకొనే వారు అభ్యర్థులను ప్రకటిస్తున్నారు. త్రిపుర విషయంలో కూడా మోదీ, షా ద్వయం అలాంటి నిర్ణయమే తీసుకుంటారేమో వేచి చూడాలి.
Comments
Please login to add a commentAdd a comment