
సాక్షి, న్యూఢిల్లీ : ఈ నెల 27వ తేదీన అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న ఈశాన్య రాష్ట్రమైన మేఘాలయలో ఊహించని రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. దేశవ్యాప్తంగా నామమాత్రపు అస్థిత్వం కలిగిన అతి చిన్న ‘నేషనల్ పీపుల్స్ పార్టీ’ రోజురోజుకు బలం పుంజుకుంటోంది. పాలకపక్ష కాంగ్రెస్ పట్ల పెరుగుతున్న వ్యతిరేకత కారణంగా పలువురు శాసన సభ్యులు, మేఘాలయ జిల్లా అటానమస్ కౌన్సిల్ సభ్యులు గతంలో బీజేపీలోకి వలసపోగా ఇప్పుడు నేషనల్ పీపుల్స్ పార్టీలోకి వలసపోతున్నారు.
నెలరోజుల క్రితం ఐదుగురు కాంగ్రెస్ శాసనసభ్యులు సహా మొత్తం ఎనిమిది మంది పాలకపక్ష సభ్యులు, పలువురు జిల్లా అటానమస్ కౌన్సిల్ సభ్యులు నేషనల్ పీపుల్స్ పార్టీలో చేరారు. అంతకుముందు ఓ నలుగురు పాలకపక్ష సభ్యులు బీజేపీలో చేరారు. జాతీయ స్థాయిలో భారతీయ జనతా పార్టీతో అంటకాగుతున్న నేషనల్ పీపుల్స్ పార్టీ రాష్ట్రంలో మాత్రం విడిగా పోటీ చేస్తోంది. అందుకు కారణం మేఘాలయ ప్రజలు, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోని ఆదివాసీలు తమ సంస్కృతిని ఆదరించని బీజేపీ పట్ల వ్యతిరేకతను పెంచుకోవడమే.
2016లో అస్సాం అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించడంతో మేఘాలయలో కూడా చాలా మంది బీజేపీకి వలసబాట పట్టారు. అయితే ఆవు మాంసానికి వ్యతిరేకంగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నోటిఫికేషన్ తీసుకరావడంతో ఆదివాసీలైన ఖాసీలు, గారోలు, జయింటీయాలు ఆ పార్టీకి ఎదురు తిరిగారు. వారంతా కూడా గోమాంసంపైనే ఆధారపడి జీవిస్తున్నారు. తమ సంస్కతిని నిషేధిస్తారా? అంటూ బీజేపీపై కోపం తెచ్చుకున్నారు. ఆ తర్వాత కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నోటిఫికేషన్‌ను ఉపసంహరించుకున్నా, ఆదివాసీలను మంచి చేసుకోవడం కోసం స్థానిక బీజేపీ నాయకులే బహిరంగ సహభంక్తి గోమాంస భోజనాలను ఏర్పాటు చేసినా లాభం లేకపోయింది. ఆరెస్సెస్ సంస్కతిని ఆ సంస్థ ప్రోద్భలంతో తమపై రుద్దేందుకు ప్రయత్నించడం ఏమిటంటూ వారు ఎదురు తిరిగారు. వారిలో సంఖ్యాపరంగా ఎక్కువగా ఉన్న ఖాసీలు ఇప్పుడు పూర్తిగా నేషనల్ పీపుల్ప్ పార్టీతో ఉన్నారు. అందుకనే ఆ పార్టీ ఎన్నికల అనంతరం అవసరమైతే బీజేపీతో పొత్తు పెట్టుకుంటారా ? అన్న ప్రశ్నకు సూటిగా సమాధానం చెప్పలేకపోతుంది.
గతంలో లోక్‌సభ స్పీకర్ పనిచేసిన పీఏ సంగ్మా 2012లో ఈ నేషనల్ పీపుల్స్ పార్టీని ఏర్పాటు చేశారు. ఆయన 2016లో మరణించడంతో ఆయన కుమారుడు సీ. సంగ్మా ఇప్పుడు బలమైన నాయకుడిగా ఎదిగారు. ఆయన పార్టీకి అధ్యక్షుడిగా పనిచేస్తున్నారు. మేఘాలయ పశ్చిమ ప్రాంతానికి చెందిన ఫిలేమాన్ లింగ్డో పార్టీలో మరో బలమైన నాయకుడు. ఆయన ఇప్పుడు పార్టీ ఎన్నికల కమిటీ చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. రానున్న ఎన్నికల్లో మళ్లీ తామే గెలుస్తామని దీమాగా చెప్పే నాయకులు పాలకపక్ష కాంగ్రెస్‌లో ఎవరూ లేరు. మేఘాలయ రాష్ట్రం మనుగడ 85 శాతం కేంద్ర ప్రభుత్వంపై ఆధారపడి ఉందికనుక రాష్ట్ర ప్రజలు తమని గెలిపిస్తారని బీజేపీ నాయకులు భావిస్తున్నారు. గోమాంసం గురించి ప్రశ్నిస్తే అది ముగిసిపోయిన అధ్యాయమని వారు చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment