ముంబై నగరి ఎవరిపై గురి | who is win in lok sabha elections in mumbai | Sakshi
Sakshi News home page

ముంబై నగరి ఎవరిపై గురి

Published Sat, Apr 27 2019 2:54 AM | Last Updated on Sat, Apr 27 2019 3:17 AM

who is win in lok sabha elections in mumbai - Sakshi

మహారాష్ట్ర రాజధాని ముంబై మహానగరంలోని ఆరు సహా 17 లోక్‌సభ స్థానాల్లో ఈ నెల 29న పోలింగ్‌ జరుగుతుంది. దీంతో రాష్ట్రంలోని మొత్తం 48 సీట్లకు ఎన్నికలు పూర్తవుతాయి. కిందటి ఎన్నికల సమయంలో కేంద్రంలో, రాష్ట్రంలో యూపీఏ ప్రభుత్వాలు అధికారంలో ఉన్నాయి. తర్వాత రెండు చోట్లా బీజేపీ నాయకత్వంలోని సంకీర్ణాల పాలన వచ్చింది. ఐదేళ్ల కాషాయ కూటమి పాలన తర్వాత ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో మారిన రాజకీయ పరిస్థితులు 2019 పార్లమెంటు ఎన్నికల ఫలితాలను ఏ మేరకు ప్రభావితం చేస్తాయో అంచనావేయ లేకపోతున్నారు.

2014లోక్‌సభ ఎన్నికల్లో ఈ 17 సీట్లలో 8 స్థానాలను బీజేపీ కైవసం చేసుకోగా, తొమ్మిది సీట్లను దాని మిత్రపక్షం శివసేన గెలుచుకుంది. నాలుగోదశలో పోలింగ్‌ జరిగే ఈ ఎన్నికల్లో మూడు కోట్ల 11 లక్షల మంది ఓటు హక్కు వినియోగించుకుంటారు. ముంబైలోని ఆరు సీట్లతో(ముంబై సౌత్, నార్త్, నార్త్‌ వెస్ట్, నార్త్‌ ఈస్ట్, నార్త్‌ సెంట్రల్, సౌత్‌ సెంట్రల్‌)పాటు నగర శివార్లలోని పాల్ఘర్, భివాండీ, కల్యాణ్, ఠాణె ఈ 17 సీట్లలో ఉన్నాయి. ఇంకా పశ్చిమ మహారాష్ట్ర పుణే జిల్లాలోని మావల్, శిరూర్, అహ్మద్‌నగర్‌ జిల్లా షిర్డీ స్థానాలేగాక ఉత్తర మహారాష్ట్రలోని నందర్బార్, ధూలే, దిండోరీ, నాశిక్‌ నియోజకవర్గాల్లో కూడా ఏప్రిల్‌ 29న పోలింగ్‌ జరుగుతుంది.

ముంబైపైనే అందరి దృష్టి
ముంబైలో నియోజకవర్గాల్లో కొన్నింటిలో ప్రముఖుల పిల్లలు పోటీలో ఉండడంతో వాటిపై విపరీతమైన ఆసక్తి నెలకొంది. ముంబై నార్త్‌లో బాలీవుడ్‌ నటి ఊర్మిళా మాటోండ్‌కర్‌(కాంగ్రెస్‌), ముంబై నార్త్‌ సెంట్రల్‌లో బాలీవుడ్‌ సునీల్‌ దత్, నర్గీస్‌ కూతురు ప్రియాదత్‌(కాంగ్రెస్‌) పోటీలో ఉన్నందు వల్ల ఈ సీట్లు కీలకంగా మారాయి. ప్రియదత్‌ను కిందటి సారి ఓడించిన పూనమ్‌ మహాజన్‌(బీజేపీ) మళ్లీ నార్త్‌ సెంట్రల్‌ నుంచే పోటీకి దిగారు. కిందటి ఎన్నికల్లో ముంబై నార్త్‌ ఈస్ట్‌ నుంచి గెలిచిన డా.కిరీట్‌ సోమయ్యకు ఈసారి బీజేపీ టికెట్‌ నిరాకరించారు. ఇక్కడ మనోజ్‌ కోటక్‌ను బీజేపీ బరిలోకి దింపింది.  ఇక్కడ సంజయ్‌ దీనా పాటిల్‌ కాంగ్రెస్‌–ఎన్సీపీ కూటమి తరఫున మరోసారి రంగంలోకి దిగారు.

ముంబై సౌత్‌ సెంట్రల్‌లో కిందటిసారి విజేత రాహుల్‌ రమేష్‌ షెవాలే(శివసేన) మళ్లీ తన పాత కాంగ్రెస్‌ ప్రత్యర్థి ఏక్‌నాథ్‌ గైక్వాడ్‌తో తలపడుతున్నారు. ముంబై సౌత్‌ నియోజకవర్గంలో ముంబై కాంగ్రెస్‌ కేంద్ర మాజీ మంత్రి మురళీ దేవరా కొడుకు, మాజీ ఎంపీ మిలింద్‌(కాంగ్రెస్‌) మరోసారి పోటీచేస్తున్నారు. 2014లో మిలింద్‌ను ఓడించిన శివసేన నేత అరవింద్‌ సావంత్‌ ఇక్కడ రంగంలో ఉన్నారు. కిందటి ఎన్నికల్లో ముంబై సీట్లన్నింటినీ మోదీ ప్రభంజనం ఫలితంగా కాషాయ కూటమి కైవసం చేసుకుంది. నగరంలో పేరుకుపోయిన సమస్యలు, నిరుద్యోగం, పెద్ద నోట్ల రద్దు ప్రభావం, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై వ్యతిరేకత కారణంగా ఈసారి ఈ కూటమికి కొన్ని చోట్ల ఓటమి తప్పదని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.

శివారులో హోరాహోరీ
ముంబై నగర శివార్లలోని పాల్ఘర్‌ స్థానంలో 2014లో బీజేపీ అభ్యర్థి చింతామణ్‌ వనగా విజయం సాధించారు. ఆయన మరణంతో జరిగిన 2018 ఉప ఎన్నికలో శివసేనతో పొత్తు లేకుండా బీజేపీ విజయం సాధించింది. కాని, ఈసారి పాల్ఘర్‌ను శివసేనకు కేటా యించారు. ఎస్టీలకు కేటాయించిన ఈ స్థానంలో శివసేన తరఫున రాజేంద్ర గావిత్‌ పోటీచేస్తున్నారు. కాంగ్రెస్‌–ఎన్సీపీ కూటమి తన మిత్రపక్షమైన బహుజన్‌ వికాస్‌ ఆఘాడీకి ఈ సీటు కేటాయించగా ఈ పార్టీ నేత, మాజీ ఎంపీ బలిరామ్‌ జాధవ్‌ మళ్లీ బరిలోకి దిగారు. 2009లో ఏ పార్టీతో పొత్తు లేకుండా బహుముఖ పోటీలో జాధవ్‌ ఈ సీటు నుంచి విజయం సాధించారు. మరో శివారు నియోజకవర్గం భివాండీలో బీజేపీ సిటింగ్‌ సభ్యుడు కపిల్‌ పాటిల్, ఆయన పూర్వ కాంగ్రెస్‌ ప్రత్యర్థి సురేష్‌ తవారే మళ్లీ ఇక్కడ పోటీపడుతున్నారు. తెలుగు ప్రాంతాల నుంచి వచ్చి స్థిరపడిన జనం పెద్ద సంఖ్యలో ఉన్నారు. ఠాణేలో శివసేన సిటింగ్‌ సభ్యుడు రాజన్‌ విచా రే, ఎన్సీపీ కొత్త అభ్యర్థి ఆనంద్‌ పరంజపేతో తలపడుతున్నారు. కల్యాణ్‌ స్థానంలో శివసేన సభ్యుడు శ్రీకాంత్‌ షిండేతో ఎన్సీపీ నేత బాబాజీ బలరాం పాటిల్‌ పోటీకి దిగారు. ఠాణే జిల్లా కేంద్ర సహకార బ్యాంక్‌ డైరెక్టర్‌ అయిన పాటిల్‌ లోక్‌సభకు పోటీచేయడం ఇదే మొదటిసారి. సామాజిక కార్యకర్తగా మంచి పేరు తెచ్చుకున్నారు. శివసేన అభ్యర్థికి ఆయన గట్టి పోటీ ఇస్తారని భావిస్తున్నారు.

పశ్చిమంలో ‘మూడు’ ఎటువైపు?
రాష్ట్రంలో అత్యధిక సంఖ్యలో ఉన్న ఆధిపత్య కులమైన మరాఠాలకు బలమైన కేంద్రమైన పశ్చిమ మహారాష్ట్రలోని మావల్, శిరూర్, షిర్డీలో కాంగ్రెస్‌–ఎన్సీపీ కూటమికి, బీజేపీ–శివసేన కూటమికి మధ్య పోటీ గట్టిగా ఉంది. మరాఠా యోధుడు శరద్‌ పవార్‌ అన్న కొడుకు, మాజీ ఎంపీ అజిత్‌ పవార్‌ కొడుకు పార్థ్‌ పవార్‌ ఎన్సీపీ అభ్యర్థిగా తొలిసారి మావల్‌ నుంచి పోటీచేస్తుండడంతో ఈ స్థానం అందరి దృష్టి ఆకర్షిస్తోంది. శరద్‌పవార్‌ ఈ ఎన్నికల్లో లోక్‌సభకు పోటీచేయరాదని నిర్ణయించుకోవడంతో పార్థ్‌కు అవకాశం వచ్చింది. శివసేన సిట్టింగ్‌ సభ్యుడు శ్రీరంగ్‌ బర్నే మళ్లీ బరిలోకి దిగారు. పవార్‌ కుటుంబ సభ్యులు శరద్, పార్థ్‌ తల్లి సునేత్ర, వరుసకు మేనత్త, శరద్‌ కూతురు సుప్రియా సూలే మావల్‌లో ఎన్సీపీ గెలుపును ప్రతిష్టాత్మకంగా తీసుకుని ప్రచారం చేస్తున్నారు. శివసేన అభ్యర్థి తరఫున కూడా బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా సహా పలువురు అగ్రనేతలు ప్రచారంలో పాల్గొంటున్నారు. ప్రధాని మోదీకి వ్యతిరేకంగా మహా రాష్ట్ర నవనిర్మాణ్‌ సేన నేత రాజ్‌ ఠాక్రే నియోజకవర్గంలో చేస్తున్న ప్రచారం కూడా ఎన్సీపీకి ప్రయోజనకరమని భావిస్తున్నారు. ఇదే ప్రాంతంలోని శిరూర్‌లో శివసేన తరఫున పోటీచేస్తున్న ప్రస్తుత ఎంపీ శివాజీరావ్‌ పాటిల్‌ గతంలో మూడుసార్లు లోక్‌సభకు ఎన్నికయ్యారు. 2014లో ఆయన తన సమీప ఎన్సీపీ ప్రత్యర్థి దేవదత్త నికమ్‌ను మూడు లక్షలకు పైగా ఓట్ల ఆధిక్యంతో ఓడించారు. ఈసారి శివాజీరావ్‌ను ఎలాగైనా ఓడించాలనే పట్టుదలతో మరాఠీ టీవీ సీరియల్‌ ‘స్వరాజ్య రక్షక్‌ సంభాజీ’ నటుడు అమోల్‌ కోల్హేకు ఎన్సీపీ టికెట్‌ ఇచ్చి ఆయన తరఫున ఉధృతంగా ప్రచారం నిర్వహిస్తోంది.

షిర్డీలో హేమాహేమీల ప్రచారం
ప్రసిద్ధ సాయిబాబా ఆలయం ఉన్న అహ్మద్‌నగర్‌ జిల్లా షిర్డీ లోక్‌సభ నియోజకవర్గంలో కాంగ్రెస్‌ నేత రాహుల్‌గాంధీ సహా ప్రధాన పార్టీల అగ్రనేతలు ప్రచారంలో పాల్గొంటున్నారు. కాషాయ కూటమిలో శివసేనకు ఈ సీటులో మరోసారి పోటీకి అవకాశమిచ్చారు. సేన సిట్టింగ్‌ సభ్యుడు సదాశివ్‌ లోఖాండే మళ్లీ పోటీచేస్తున్నారు. ఆయనపై కాంగ్రెస్‌ అభ్యర్థి భౌసాహిబ్‌ మల్హరీ కాంబ్లే పోటీకి దిగారు. ఈ ప్రాంతంలో రైతుల్లో పెరుగుతున్న అసంతృప్తి వల్ల శివసేన అభ్యర్థి గెలుపు అంత తేలిక కాదని భావిస్తున్నారు. కిందటి ఎన్నికల్లో కాంగ్రెస్‌ తరఫున పోటీచేసిన రాజారామ్‌ వాక్‌చౌరేపై దాదాపు రెండు లక్షల ఓట్ల ఆధిక్యంతో శివసేన అభ్యర్థి గెలిచారు. రాజారామ్‌ వాక్‌చౌరే తర్వాత బీజేపీలో చేరి షిర్డీ సాయిబాబా సంస్థాన్‌ ట్రస్టీగా నియమితులయ్యారు. ఈ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీకి దిగడంతో ఆయనను బీజేపీ బహిష్కరించింది. ఈ కీచులాటల వల్ల శివసేన నేత లొఖాండేకు గట్టి పోటీ ఎదురౌతోంది.

64 మంది అభ్యర్థులపై తీవ్ర నేరారోపణలు
మహారాష్ట్రలోని 17 లోక్‌సభ స్థానాల్లో పోటీపడుతున్న 323 అభ్యర్థుల్లో 109 మంది కోటీశ్వరులున్నారు. వారిలో 64 మంది అభ్యర్థులపై తీవ్ర నేరారోపణులున్నాయని నేషనల్‌ ఎలక్షన్‌ వాచ్, ప్రజాస్వామ్య సంస్కరణల సంఘం(ఏడీఆర్‌) వెల్లడించాయి. ఈ అభ్యర్థులు తమ అఫిడవిట్లలో తెలిపిన వివరాల ఆధారంగా ఈ విషయాలు తెలిశాయి. వంచిత్‌ బహుజన్‌ ఆఘాడీకి చెందిన ఓ అభ్యర్థి హత్య కేసులో నిందితుడని, మరో ముగ్గురు అభ్యర్థులు హత్యాయత్నం కేసుల్లో నిందితులని ఈ సంస్థలు తెలిపాయి.

ప్రియ వర్సెస్‌ పూనమ్‌
బీజేపీ సిట్టింగ్‌ ఎంపీ ప్రమోద్‌ మహాజన్‌ కూతురు పూనమ్‌. సినీ రాజకీయ రంగాల్లో రాణించి స్థానిక ప్రజల్లో తనదైన ముద్ర వేసిన సునీల్‌ దత్‌ కూతురూ,  ప్రియాదత్‌ కాంగ్రెస్‌ అభ్యర్థిగా ముంబై నార్త్‌ సెంట్రల్‌ నుంచి తలపడబోతున్నారు. 2004, 2009లో ముంబైలో  గెలుపు బావుటా ఎగురవేసిన ప్రియాదత్‌పై 2014లో బీజేపీ అభ్యర్థి పూనమ్‌ మహాజన్‌ 1 లక్షా 86 వేల ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. మోదీ ప్రభంజనంలో పూనమ్‌కు  56.6శాతం ఓట్లు  వస్తే, కాంగ్రెస్‌కి పట్టున్న ఈ స్థానంలో కాంగ్రెస్‌ అభ్యర్థి  ప్రియాదత్‌కి 34.51 శాతం ఓట్లు పోలయ్యాయి. ముంబై మెట్రో నిర్మాణం, ముంబై పోర్ట్‌ ట్రస్ట్, నెహ్రూ పోర్ట్‌ ట్రస్ట్‌లను కలుపుతూ రవాణా వ్యవస్థను ఏర్పాటు, ఎయిర్‌పోర్ట్‌ పరిసరాల్లోని మురికివాడల ప్రజలకు గృహ నిర్మాణం బీజేపీ అభ్యర్థి పూనమ్‌ మహాజన్‌ ఎన్నికల ప్రచారంలో ప్రధానంగా వినిపిస్తోన్న హామీలు. ఆమె ప్రత్యర్థి ప్రియాదత్‌ మాత్రం ఇళ్ల నిర్మాణమే తన తక్షణ ప్రాధాన్యత అనీ, పర్యావరణ పరిరక్షణ, మురికివాడల అభివృద్ధిని చేపడతానంటున్నారు.


ముంబై సౌత్‌లో మిలింద్‌ దేవరా

ముంబై సౌత్‌లో శివసేన సిట్టింగ్‌ సభ్యుడు అరవింద్‌ సావంత్‌తో మరోసారి కాంగ్రెస్‌ మాజీ మంత్రి మిలింద్‌ దేవరా తలపడుతున్నారు. నెల క్రితమే ఆయన నగర కాంగ్రెస్‌ అధ్యక్ష పదవి చేపట్టారు. ఆయన తండ్రి, కేంద్ర మాజీ మంత్రి మురళీ దేవరా 22 ఏళ్లు ఈ పదవిలో ఉన్నారు. నియోజకవర్గంలోని 15 లక్షల 30 వేల మంది ఓటర్లలో ఆరు లక్షల మంది మరాఠీలు కాగా, దాదాపు మూడున్నర లక్షల మంది ముస్లింలు ఉన్నారు. ఈ రెండు వర్గాల ఓట్ల కోసం సావంత్, దేవరా గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. 2014 ఎన్నికల్లో మిలింద్‌పై శివసేన నేత సావంత్‌ లక్షా పాతిక వేల ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. అప్పుడు 84 వేల ఓట్లు సాధించిన మహారాష్ట్ర నవనిర్మాణ్‌ సేన(ఎంఎన్‌ఎస్‌) ఈసారి పోటీలో లేదు.  నియోజకవర్గంలోని కాలాచౌకీ ప్రాంతంలో ఎంఎన్‌ఎస్‌ నేత రాజ్‌ ఠాక్రే భారీ ర్యాలీలో ప్రసంగిస్తూ బీజేపీని కేంద్రంలో అధికారంలోకి రాకుండా చేయడానికి ముంబై సౌత్‌లో శివసేనను ఓడించాలని పిలుపునిచ్చారు. దీని వల్ల కాంగ్రెస్‌ అభ్యర్థి మిలింద్‌కు ప్రయోజనకరమని భావిస్తున్నారు. అరవింద్‌ సావంత్‌ తరఫున  శివసేన అధినేత కొడుకు, యువ సేన నేత ఆదిత్య ఠాక్రే అనేక ప్రాంతాల్లో ప్రచారం నిర్వహించారు.

ఊర్మిళ వర్సెస్‌ గోపాల్‌ షెట్టి
సినీ నటి ఊర్మిళ మాటోండ్కర్, స్థానిక బీజేపీ నాయకుడు గోపాల్‌ షెట్టిల మధ్య ముంబైనార్త్‌లో పోటీ రసవత్తరంగా మారింది. 2014 ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థి సంజయ్‌ నిరుపమ్‌పై 4 లక్షల ఓట్ల మెజారిటీతో గోపాల్‌ షెట్టి గెలిచారు. 16 లక్షల మంది ఓటర్లున్న ముంబై నార్త్‌లోని మొత్తం ఆరు అసెంబ్లీ సీట్లలో మలద్‌ అసెంబ్లీ సీటు ఒక్కటే 2014లో కాంగ్రెస్‌ గెలుచుకోగలిగింది. నాలుగు బీజేపీ, ఒకటి శివసేన దక్కించుకున్నాయి. ఎన్నికల నోటిఫికేషన్‌కి ముందే కాంగ్రెస్‌లో చేరిన ఊర్మిళ ఈ దేశంలో భావ వ్యక్తీకరణ ప్రమాదకరంగా తయారయిందంటూ బీజేపీని విమర్శించారు. అత్యధికంగా క్రైస్తవుల జనాభా ఉన్న ముంబై నార్త్‌లోని వర్లీ, మాల్వానీ ప్రాంతాల్లో గత ఎన్నికల సందర్భంగా క్రైస్తవులను విదేశీయులంటూ గోపాల్‌షెట్టి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం దుమారం రేపింది. ఓ పక్క ఊర్మిళ ప్రచార హోరు, ఊర్మిళకున్న జనాకర్షణకు తోడు గోపాల్‌ షెట్టిపై క్రైస్తవుల్లో ఉన్న వ్యతిరేకత కాంగ్రెస్‌కి కలిసొచ్చే అంశాలని విశ్లేషకులు భావిస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement