
మహా సర్కార్ కొలువు తీరే వేళ శివసేన-ఎన్సీపీ- కాంగ్రెస్‌లు కనీస ఉమ్మడి కార్యక్రమం ప్రకటించారు.
ముంబై : రైతులు, ఉపాధి కల్పనే ప్రధాన అజెండాగా మహారాష్ట్రలో కొలువుతీరే ఎన్సీపీ-కాంగ్రెస్-శివసేన కూటమి ప్రభుత్వం కనీస ఉమ్మడి కార్యక్రమం (సీఎంపీ) విడుదల చేసింది. అకాల వర్షాలు, వరదల వల్ల భారీగా నష్టపోయిన రైతాంగానికి తక్షణ సాయం, వ్యవసాయ రుణాల రద్దు, పంటల బీమా పథకంతో పాటు రైతులకు గిట్టుబాటు ధరల కల్పనకు పెద్దపీట వేయనున్నట్టు సీఎంపీ వెల్లడించింది. కరువు పీడిత ప్రాంతాలకు నీటి సరఫరాపై నిర్ధిష్ట చర్యలు చేపడతామని పేర్కొంది. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న పోస్టులన్నింటినీ సత్వరమే భర్తీ చేస్తామని తెలిపింది. అర్హులైన నిరుద్యోగ యువతకు ఫెలోషిప్ మంజూరు, స్ధానిక యువతకు ఉద్యోగాల్లో 80 శాతం రిజర్వేషన్ కోసం చట్టం తీసుకువస్తామని సీఎంపీలో పొందుపరిచారు. బాలికలకు ఉచిత విద్య, మహిళల భద్రతకు పెద్దపీట వేస్తామని కూటమి నేతలు సీఎంపీలో ప్రస్తావించారు.