
అహ్మదాబాద్: గుజరాత్‌లో 182 శాసనసభ స్థానాలు ఉన్నాయి. 20 శాతంపైగా ఉన్న ముస్లిం ఓటర్లు 20 స్థానాల్లో ప్రభావం చూపించనున్నారు. ముస్లింలు అధికంగా ఉన్న నియోజకవర్గాల్లో నాలుగు అహ్మదాబాద్ జిల్లాలోనే ఉన్నాయి. భరూచ్, కచ్ జిల్లాలో మూడేసి ఉన్నాయి. అయితే ఈసారి ఎన్నికల్లో ముస్లింల గురించి ఏ పార్టీ కూడా ప్రస్తావించకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. గత ఎన్నికల్లో ముస్లింలు, మైనారిటీల గురించి ఊదరగొట్టిన కాంగ్రెస్ పార్టీ ఈసారి మౌనం దాల్చడం చర్చనీయాంశంగా మారింది.
గుజరాత్ ఎన్నికల ప్రచారంలో కుల సంఘాలు, నాయకులు హవా నడుస్తోంది. పటీదార్ అనామత్ ఆందోళన్ సమితి నేత హార్దిక్ పటేల్, ఓబీసీ నాయకుడు-కాంగ్రెస్ పార్టీ సభ్యుడు అల్పేశ్ థాకూర్, దళిత నాయకుడు జిగ్నేశ్ మెవానీ తమ గళాన్ని గట్టిగా విన్పిస్తున్నారు. దీంతో ఎన్నికల ప్రచారంలో వీరికి ప్రాధాన్యం దక్కుతోంది. ఈసారి ఎన్నికల ప్రచారంలో ఎక్కడా ముస్లింల ప్రస్తావన రాకపోవడం గమనార్హం.
గుజరాత్‌లో దాడుల తర్వాత 2002లో జరిగిన ఎన్నికల్లో ముస్లింల భద్రత ప్రాధానాంశంగా మారింది. మైనారిటీల భద్రత అంశాన్ని కాంగ్రెస్ పార్టీ బాగా ప్రచారం చేసింది. 2007 ఎన్నికల్లోనూ ఇదే రకమైన వ్యూహంతో కాంగ్రెస్ ముందుకెళ్లింది. సోనియ గాంధీ నేరుగా నరేంద్ర మోదీని మృత్యు వ్యాపారిగా వర్ణించారు. 2012 ఎన్నికల సమయంలోనూ ముస్లిం, మైనారిటీల భద్రత అంశాన్ని ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ విస్తృతంగా వాడుకుంది. అయినప్పటికీ అంతకుముందు ఎన్నికల్లో వచ్చిన ఫలితాలే వచ్చాయి తప్పా మార్పు ఏమీ కనబడలేదు.
2014లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ ఇదేవిధంగా ప్రచారం చేసింది. విషబీజాలు నాటుతున్నారంటూ మోదీపై పరోక్షంగా సోనియా విమర్శలు కూడా చేశారు. ఈసారి కూడా ఫలితం బీజేపీకి అనుకూలంగానే వచ్చింది. కాషాయ పార్టీ 26 ఎంపీ సీట్లు గెల్చుకుంది. అందుకే ఈ పర్యాయం కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ప్రజలందరూ చూస్తుండగా అరడజను దేవాలయాలను సందర్శించి, పూజలు చేశారు. కాంగ్రెస్ గత ప్రచారానికి భిన్నంగా ఎక్కడా ముస్లిం భద్రత అంశాన్ని ప్రస్తావించలేదు.
గుజరాత్‌లో 9 నుంచి 10 శాతం వరకు ముస్లింలు ఉన్నారు. దీని ఆధారంగా చూస్తే అసెంబ్లీ 18 వరకు ముస్లిం ఎమ్మెల్యేలు ఉండాలని కొంతమంది వాదన. 1980లో అత్యధికంగా 12 మంది ముస్లింలు ఎమ్మెల్యేలు ఎన్నికయ్యారు. గుజరాత్ నుంచి పార్లమెంట్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న ఏకైన ఎంపీ అహ్మద్ పటేల్ కావడం విశేషం. 1977లో ఇద్దరు ముస్లింలు ఎంపీలుగా ఎన్నికయ్యారు. 2007లో కాంగ్రెస్‌కు 69 శాతం, బీజేపీకి 20 శాతం.. 2012లో కాంగ్రెస్‌కు 64 శాతం, బీజేపీకి 16 శాతం ముస్లింలు ఓట్లు వేసినట్టు సీఎస్‌డీఎస్ సర్వేలో వెల్లడైంది. ముస్లిం ఓట్ల శాతం క్రమంగా తగ్గుతుండటంతో తాజా ఎన్నికల్లో కాంగ్రెస్ రూటు మార్చింది. ఈసారి 49 శాతం కాంగ్రెస్‌కు, 27 శాతం బీజేపీకి ముస్లిం ఓట్లు రావొచ్చని సీఎస్‌డీఎస్ తాజా సర్వే అంచనా వేసింది. డిసెంబర్ 9, 14 తేదీల్లో ఎన్నికల పోలింగ్ జరగనుంది.
Comments
Please login to add a commentAdd a comment