
సాక్షి, విజయవాడ : వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాదయాత్ర ప్రకటన చేసినప్పటి నుంచి టీడీపీ గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయని వైఎస్‌ఆర్ సీపీ నేతలు వెల్లంపల్లి శ్రీనివాస్, మల్లాది విష్ణు వ్యాఖ్యానించారు. కోర్టు తీర్పుకు లోబడే వైఎస్ జగన్ పాదయాత్ర ఉంటుందని, నవంబర్ 6వ తేదీ నుంచి పాదయాత్ర ప్రారంభం అవుతుందని వారు తెలిపారు. విజయవాడలోని పార్టీ కార్యాలయంలో మంగళవారం వెల్లంపల్లి శ్రీనివాస్, మల్లాది విష్ణు మీడియా సమావేశంలో మాట్లాడారు. ‘ సీబీఐ కోర్టులో వైఎస్ జగన్‌కు ఊరట రాదని, డిప్యూటీ సీఎం చినరాజప్ప ముందే ఎలా చెప్పారు?. చినరాజప్ప వ్యాఖ్యలను సీబీఐ కోర్టు సుమెటోగా స్వీకరించాలి.
వైఎస్ జగన్ పాదయాత్ర అంటే టీడీపీ నేతలకు భయమెందుకు?. అనేక కేసుల్లో స్టేలు తెచ్చుకున్న ఘనుడు చంద్రబాబు. తెలంగాణలో ఫోన్‌కాల్ ఆధారంగా మాజీమంత్రి శ్రీధర్ బాబుపై కేసుపెట్టి నిందితులను అరెస్ట్ చేశారు. మరి ఓటుకు కోట్లు కేసులో రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిన చంద్రబాబుపై కేసీఆర్ సర్కార్ కేసులు పెట్టి ఎందుకు అరెస్ట్ చేయలేదు?. రేవంత్ రెడ్డి ఆరోపణలపై చంద్రబాబు, యనమల రామకృష్ణుడు ఎందుకు స్పందించలేదు?. వైఎస్ జగన్‌ను విమర్శించడమే టీడీపీ నేతలకు సింగిల్ పాయింట్ ఎజెండాగా మారింది. ప్రతిపక్ష నేత పాదయాత్ర చేయకూడదా?. టీడీపీ నేతలు తమ స్థాయిని దిగజారి మాట్లాడుతున్నారు. అవాకులు, చవాకులు మాట్లాడితే చూస్తూ ఊరుకోం.’ అని వారు హెచ్చరించారు.